Friday, November 4, 2011

సిగ్గు లేని ప్రభుత్వం

ఇది భారతదేశం కాదు. ధరల భారతం. దేశంలో అతి వేగంగా పెరుగుతున్నది జనాభా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ.. దానికంటే వేగంగా పెరుగుతున్నవి సామాన్యుడు వాడే వస్తువులు. సగటున ఇండియాలో ప్రతి వారం ఏదో ఒక వస్తువు ధర పెరుగుతూ పోతోంది. గత మూడేళ్లలో ద్రవ్యోల్బణం రెండంకెలు దాటింది. నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచే ప్రభుత్వాలను ఎవరు మాత్రం ఏం చేయగలరు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తాజాగా ద్రవ్యోల్బణం 12.21 శాతానికి చేరుకుంది. అక్టోబరు 22 నాటికి ద్రవ్యోల్బణం 12.21 శాతమని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. పప్పులు, పండ్లు, పాలు… తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగిందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. అంతకు ముందు వారంలో ద్రవ్యోల్బణం 11.43 శాతంగా ఉండటం గమనార్హం. ఆహారధరలు పెరగడంపై ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ మొసలి కన్నీరు కార్చారు. పైగా పండగల సీజన్‌కావడంతో ధరలు పెరిగినట్టు ఆయన వ్యాఖ్యానించారు.
మరోసారి పెట్రోలు వాత !
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి ‘పెట్రో’ బాంబు పేల్చాయి. పెట్రోలు ధర లీటర్‌కు రూ.1.82 మేర పెరిగింది. ఈ పెంచిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనం కావడంతో డాలరు విలువ పెరిగి చమురు ధరలకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుందట. అందుకని చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచాయట. ఎవరిని నమ్మించడానికి ఈ కల్లిబొల్లి మాటలు?

No comments:

Post a Comment

Thank you for your comment