Thursday, November 10, 2011

ఎస్సార్సీ కలకలం

చిన్నరాష్ట్రాల ఏర్పాటు కోసం రెండవ ఎస్సార్సీ అవసరమని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ, సీనియర్‌ నాయ కుడు దిగ్విజరుసింగ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమా రాన్ని లేపాయి. రాష్ట్రానికి చెందిన పలు పార్టీలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో కలకలం సృష్టించడానికి కావాలనే కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రకటన చేసిందని విమర్శించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనను అంగీకరించేది లేదని స్పష్టంచేశాయి.
ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి చేస్తున్న యత్నాలపై కాంగ్రెస్‌ స్పందిస్తూ దీనికి ఎస్సార్సీయే తమ విధానమని వారు పేర్కొనడాన్ని టిఆర్‌ఎస్‌ తీవ్రంగా మండిపడింది. ఎస్సార్సీ పేర తెలంగాణ ఏర్పాటును మళ్లీ దాటవేస్తే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుందని టిఆర్‌ఎస్‌ దుమ్మెత్తిపోసింది. డిసెంబర్‌ 9 ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు చేయాలని లేకుంటే కాంగ్రెస్‌ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం కానుందని ఆ పార్టీ నాయకుడు ఈటెల రాజేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌పార్టీ మరొకసారి మోసానికి పాల్పడుతోందని ఇదే జరిగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టిఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పరచకుండా ప్రజలను అవమానపరిస్తే పార్టీ మట్టికరవక తప్పదని ధ్వజమెత్తారు. తెలంగాణ తప్ప తాము దేనికీ అంగీకరించమని, కాంగ్రెస్‌ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ విషయమై ఎస్సార్సీ ప్రస్తావన వచ్చిందని తెలంగాణతో దీనికి సంబంధం లేదని మరొక నాయకుడు వినోద్‌ అన్నారు.
కాంగ్రెస్‌ జాతీయ నాయకులు రషీద్‌ అల్వీ, దిగ్విజరు సింగ్‌లు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ తెలుగుదేశం ఫోరం వ్యతిరేకించింది. ఫోరం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఈ వ్యాఖ్యలపై  మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అవగాహన మేరకు అల్వీ, దిగ్విజరుల వ్యాఖ్యలు వెలువడ్డాయని ఆయన ఆరోపించారు. మరోమారు తెలంగాణను మోసగించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో ఎస్‌ఆర్‌సికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడితే తెలంగాణలో ప్రజా తిరుగుబాటు తప్పదని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ఛైర్మన్‌ గద్దర్‌ హెచ్చరించారు.  కాంగ్రెస్‌ పార్టీ ద్రోహపూరితంగా, మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై పునర్విభజన కమిషన్‌ ఏర్పాటే తమ విధానమైతే తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ డిసెంబర్‌ 9వ తేదీన ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ 2004లో టిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ ఎన్నికల పొత్తు ఎందుకు పెట్టుకున్నట్లని, యుపిఎ కనీస ఉమ్మడి ప్రణాళికలో ఎందుకు చేర్చినట్లని ఆయన నిలదీశారు. భారత రాష్ట్రపతి చేత పార్లమెంట్‌లో మాట్లాడించిన, ప్రణబ్‌ముఖర్జీ, శ్రీకృష్ణ కమిటీలు వేసిన విషయాన్ని మర్చిపోవడం తగునా అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీ, యుపిఎ ప్రభుత్వం వ్యవహరిస్తే తెలంగాణలో తిరుగుబాటు తప్పదని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాస్వామ్యవాదులంతా తెలంగాణ ప్రజలకు అండగా నిలవాలని గద్దర్ కోరారు.
ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఐకమత్యంతో ముందుకు సాగితేనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ స్పష్టంచేశారు. మండలి ఏర్పాటు, ప్రత్యేక ప్యాకేజీ, రెండో ఎస్‌ఆర్‌సి వంటి వాటికి తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని, అన్ని సమస్యలకు రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే ఏకైక పరిష్కారం అని తేల్చిచెప్పారు. నిమ్స్‌ వద్ద బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రజల చిరకాల ఆకాంక్ష అని చెప్పారు. కేంద్ర మంత్రి గులామ్‌నబీ ఆజాద్‌ ఢిల్లీలో చెప్పిన మాటలను పరిశీలిస్తే తెలంగాణకు సానుకూలంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సకల జనుల సమ్మె కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించిందని, అందుకే ఢిల్లీలో పరిణామాలు వేగవంతంగా మారాయని చెప్పారు. కొన్ని పత్రికలు, ఛానెళ్లు తెలంగాణపై ఊహాజనితమైన కథనాలు వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ దీక్షకు తాము మద్దతివ్వలేదని జరుగుతున్న ప్రచారంలో అర్థంలేదని, తాను చాలా స్పష్టంగా సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన దీక్షపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ మాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు చంద్రబాబునాయుడుకు లేదని ఆయన స్పష్టంచేశారు.

No comments:

Post a Comment

Thank you for your comment