Thursday, November 10, 2011

ఎస్సార్సీ తోనే పరిష్కారం : రాయపాటి

 ‘దిగ్విజయ్‌సింగ్ రాహుల్‌గాంధీకి సలహాదారు. అధిష్టానానికి చాలా దగ్గరగా ఉంటారు. తెలంగాణ విషయంలో దిగ్విజయ్‌ చేసిన వ్యాఖ్యలు నిజమే కావొచ్చు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం రెండవ ఎస్సార్సీ వేస్తారనే అనుకుంటున్నా. దేశవ్యాప్తంగా వస్తున్న పలు రాష్ట్రాల డిమాండ్లకు ఎస్సార్సీతో పరిష్కారం లభిస్తుంది’ అని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు.  శాంతియుతంగా ఆందోళన చేసి ఉంటే తెలంగాణ వచ్చేది. కానీ అలా చేయకుండా ప్రభుత్వాన్ని, సామాన్యులను ఆందోళనల పేరుతో వేధించారు. సర్కారును అస్థిరపరిచేలా సింగిల్ పాయింట్ కార్యక్రమాన్ని నిర్వహించారు అని అన్నారు.
దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల డిమాండ్ పరిష్కారానికి ఎస్సార్సీని ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ వైఖరి అంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్‌సింగ్, రషీద్ అల్వీలు చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
Read More >>

బీజేపీకి దూరంగా ‘గాలి’ వర్గం

 కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు  శ్రీరాములు  బీజేపీకి గుడ్ బై చెప్పారు.  నవంబర్ 30 తేదిన జరుగనున్న ఉప ఎన్నికలో పోటీ గురించి చంచల్‌గూడలోని గాలిని మంగళవారం సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామ లేఖను జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్పకు పంపారు.
బళ్లారి రూరల్ లో జరుగుతున్న ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. అక్రమ గనుల కేసులో చంచల్ గూడ జైలులో గడుపుతున్న గాలి సోదరులు శ్రీరాములును పార్టీకి రాజీనామా చేయించడం ద్వారా బీజేపీ అధిష్టానంపై తమ వ్యతిరేకతను వెల్లడించినట్లయింది.
Read More >>

తేనెతుట్టెను కదిలిస్తున్నారు : నారాయణ

2004 నుండి తెలంగాణ అంశాన్ని నానుస్తూ, ఇంకా ఊగిసలాట వైఖరి ప్రదర్శిస్తూ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం, పైగా ఒకప్పుడు తిరస్కరించబడ్డ రెండవ ఎస్‌ఆర్‌సిని తెర మీదికి తీసుకురావడం కాంగ్రెస్‌ దివాళాకోరు రాజకీయాలకు అద్దం పడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
తెలంగాణ సమస్యకు రెండవ పునర్విభజన కమిషన్‌ ఏర్పాటు పరిష్కారం కాదని, అలా చేస్తే కందిరీగల తుట్టెను కదిలించడమే అవుతుందని  హెచ్చరించారు. రెండవ ఎస్‌ఆర్‌సిని ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ సమస్య రావణ కాష్టంలా తగలబడుతూనే ఉంటుందని అన్నారు. ఈ నెల 13వ తేదీన అనారోగ్యాలు, పారిశుధ్య సమస్యలపై రాష్ట్రవ్యాపితంగా తలపెట్టిన శ్రమదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Read More >>

ఎస్సార్సీ కలకలం

చిన్నరాష్ట్రాల ఏర్పాటు కోసం రెండవ ఎస్సార్సీ అవసరమని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ, సీనియర్‌ నాయ కుడు దిగ్విజరుసింగ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమా రాన్ని లేపాయి. రాష్ట్రానికి చెందిన పలు పార్టీలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో కలకలం సృష్టించడానికి కావాలనే కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రకటన చేసిందని విమర్శించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదనను అంగీకరించేది లేదని స్పష్టంచేశాయి.
ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి చేస్తున్న యత్నాలపై కాంగ్రెస్‌ స్పందిస్తూ దీనికి ఎస్సార్సీయే తమ విధానమని వారు పేర్కొనడాన్ని టిఆర్‌ఎస్‌ తీవ్రంగా మండిపడింది. ఎస్సార్సీ పేర తెలంగాణ ఏర్పాటును మళ్లీ దాటవేస్తే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో భూస్థాపితం అవుతుందని టిఆర్‌ఎస్‌ దుమ్మెత్తిపోసింది. డిసెంబర్‌ 9 ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ ఏర్పాటు చేయాలని లేకుంటే కాంగ్రెస్‌ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం కానుందని ఆ పార్టీ నాయకుడు ఈటెల రాజేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌పార్టీ మరొకసారి మోసానికి పాల్పడుతోందని ఇదే జరిగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టిఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పరచకుండా ప్రజలను అవమానపరిస్తే పార్టీ మట్టికరవక తప్పదని ధ్వజమెత్తారు. తెలంగాణ తప్ప తాము దేనికీ అంగీకరించమని, కాంగ్రెస్‌ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌ విషయమై ఎస్సార్సీ ప్రస్తావన వచ్చిందని తెలంగాణతో దీనికి సంబంధం లేదని మరొక నాయకుడు వినోద్‌ అన్నారు.
కాంగ్రెస్‌ జాతీయ నాయకులు రషీద్‌ అల్వీ, దిగ్విజరు సింగ్‌లు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ తెలుగుదేశం ఫోరం వ్యతిరేకించింది. ఫోరం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఈ వ్యాఖ్యలపై  మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల అవగాహన మేరకు అల్వీ, దిగ్విజరుల వ్యాఖ్యలు వెలువడ్డాయని ఆయన ఆరోపించారు. మరోమారు తెలంగాణను మోసగించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో ఎస్‌ఆర్‌సికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడితే తెలంగాణలో ప్రజా తిరుగుబాటు తప్పదని తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ఛైర్మన్‌ గద్దర్‌ హెచ్చరించారు.  కాంగ్రెస్‌ పార్టీ ద్రోహపూరితంగా, మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై పునర్విభజన కమిషన్‌ ఏర్పాటే తమ విధానమైతే తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామంటూ డిసెంబర్‌ 9వ తేదీన ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తూ 2004లో టిఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ ఎన్నికల పొత్తు ఎందుకు పెట్టుకున్నట్లని, యుపిఎ కనీస ఉమ్మడి ప్రణాళికలో ఎందుకు చేర్చినట్లని ఆయన నిలదీశారు. భారత రాష్ట్రపతి చేత పార్లమెంట్‌లో మాట్లాడించిన, ప్రణబ్‌ముఖర్జీ, శ్రీకృష్ణ కమిటీలు వేసిన విషయాన్ని మర్చిపోవడం తగునా అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్‌ పార్టీ, యుపిఎ ప్రభుత్వం వ్యవహరిస్తే తెలంగాణలో తిరుగుబాటు తప్పదని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాస్వామ్యవాదులంతా తెలంగాణ ప్రజలకు అండగా నిలవాలని గద్దర్ కోరారు.
ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఐకమత్యంతో ముందుకు సాగితేనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ స్పష్టంచేశారు. మండలి ఏర్పాటు, ప్రత్యేక ప్యాకేజీ, రెండో ఎస్‌ఆర్‌సి వంటి వాటికి తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని, అన్ని సమస్యలకు రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే ఏకైక పరిష్కారం అని తేల్చిచెప్పారు. నిమ్స్‌ వద్ద బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రజల చిరకాల ఆకాంక్ష అని చెప్పారు. కేంద్ర మంత్రి గులామ్‌నబీ ఆజాద్‌ ఢిల్లీలో చెప్పిన మాటలను పరిశీలిస్తే తెలంగాణకు సానుకూలంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సకల జనుల సమ్మె కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించిందని, అందుకే ఢిల్లీలో పరిణామాలు వేగవంతంగా మారాయని చెప్పారు. కొన్ని పత్రికలు, ఛానెళ్లు తెలంగాణపై ఊహాజనితమైన కథనాలు వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ దీక్షకు తాము మద్దతివ్వలేదని జరుగుతున్న ప్రచారంలో అర్థంలేదని, తాను చాలా స్పష్టంగా సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన దీక్షపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ మాత్రం స్పందించకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు చంద్రబాబునాయుడుకు లేదని ఆయన స్పష్టంచేశారు.
Read More >>

కాంగ్రెస్ నోట ఎస్సార్సీ మాట

తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నోట పాతపాట మరోసారి విన్పించింది. కొత్తగా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ (ఎస్‌ఆర్‌సి) ఒక్కటే ప్రత్యామ్నాయమని కాంగ్రెస్‌ పార్టీ సూచన ప్రాయంగా వెల్లడించింది. ఢిల్లీలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ, బోఫాల్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరు సింగ్‌లు ఒకేసారి ఈ ప్రకటన చేయడం  రాష్ట్రంలో కలకలం సృష్టించింది.                                                                                   దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ఒక ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని ఎఐసిసి అధికార ప్రతినిధి రషీద్‌ అల్వీ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఈనెల 10వ తేదీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం తెలంగాణకు సంబంధించి ఒక ప్రకటన చేస్తారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌ ప్రకటించిన మరునాడే రషీద్‌ అల్వీ ఈ ప్రకటన చేయడం విశేషం. తెలంగాణ సమస్య కూడా ప్రత్యేక కమిషన్‌ ద్వారానే పరిష్కార మవుతుందని రషీద్‌ అల్వీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్రాల ఏర్పాటు కోసం డిమాండ్లు వస్తున్న నేప థ్యంలో ప్రత్యేక కమిషన్‌ను నియమించడమొక్కటే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రత్యేక కమిషన్‌ వేయాలి. తెలంగాణ సమస్య కూడా ఇలాంటి కమిషన్‌ ద్వారానే పరిష్కారమవుతుంది. దేశంలో చాలా చోట్ల చిన్న రాష్ట్రాల డిమాండ్‌ వుంది. చిన్న రాష్ట్రాల డిమాండ్‌ దృష్ట్యా ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు అవసరం వుంది. నేను చిన్న రాష్ట్రాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని చెపుతున్నాను. అందులో మార్పు వుండదు అని ఆయన పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. కేవలం ఒక రాష్ట్రాన్ని దృష్టిలో వుంచుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరగదని స్పష్టంచేశారు. దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం అవసర మన్నారు. అయితే తెలంగాణకు ఇదే సూత్రం వర్తిస్తుందా అన్న అంశంపై రషీద్‌అల్వీ స్పష్టత ఇవ్వలేదు.
తెలంగాణ సమస్య భిన్నమైనదేమీ కాదు. కాకపోతే క్లిష్టమైనది. అంతేగాకుండా ఈ సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నది. ఈ అంశాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ పార్ట్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ చూస్తున్నారు. ఈ విషయం గురించి ఆయననే అడిగితే మంచిది. కాకపోతే చిన్నరాష్ట్రాల సమస్య అంతా ఒక్కటేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని ఆయనన్నారు. భోపాల్‌లో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్‌ మాట్లాడుతూ, తెలంగాణతోపాటు చిన్న రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్‌ వైఖరి స్పష్టంగా వుందని చెప్పారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి రెండవ ఎస్సార్సీ ఒక్కటే పరిష్కారమార్గమని ఆయనన్నారు. సమయానుకూలంగా ఎస్సార్సీని ఏర్పాటు చేయడం అవసరమన్నారు.
Read More >>

అంగరంగవైభవంగా “ఆటా రోజు”

అట్లాంట విభాగపు అమెరికన్ తెలుగు అసోసియేషన్, పన్నెండవ ఆటా కన్వెన్షన్ సంయుక్తంగా నిర్వహించిన  అట్లాంట  ‘ఆటా రోజు’ వేడుకలు నవంబర్ 5, 2011 సాయంత్రం సాయి మురళి రెస్టారెంట్లో కనుల విందుగా జరిగాయి. సుదూరాల నుంచి వచ్చిన అతిథులకు  కరుణ్ ఎసిరెడ్డి (కన్వీనర్, పన్నెండవ ఆటా కన్వెన్షన్) ఘనమైన స్వాగతం పలికారు. ఈ వేడుకలు కరుణాకర్ ఏసిరెడ్డి, డా. జగన్ మోహన్ రావు (కో ఆర్డినేటర్, పన్నెండవ ఆటా కన్వెన్షన్ 2012 ), విక్రం సూదిని మరియు ప్రశీల్ గూకంటి (అట్లాంట ఆటా కోఆర్డినేటర్) పర్యవేక్షణలో జరిగాయి. దాదాపు 500లకు పైగా తెలుగువారు తమ కుటుంభ సభ్యులతో ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ ఆటా రోజు జరుపుకోడం ఆటా ఆనవాయితీ అయినా ఈ సంవత్సరం వేడుకల్లో దాతలను సత్కరించారు.
అట్లాంటా ప్రాంతంలో ఇప్పటివరకు దాదాపు $350,000 విరాళాలు హామీ రూపకంగా సేకరించారు. అందులో ఎక్కువ మొత్తంలో   ($25,000) విరాళాలు ప్రకటించిన మహా దాతలు SP రెడ్డి  (eGenious Consulting),  మురళి  సజ్జ  & ప్రమోద్  సజ్జ  (Paramount Consulting), మురళి  రెడ్డి  & దేవేందర్  రెడ్డి  (Charter Global).  రాబోయే సంవత్సరంలో జరగబోయే  పన్నెండవ ఆటా కన్వెన్షన్ నిర్వహణకై కావాల్సిన ఆర్థిక వనరులను అందజేయడంలో చేయూత నిచ్చిన దాతలకు  పేరు పేరున కృతఙ్ఞతలు అందజేస్తూ కరుణ్ ఎసిరెడ్డి, దాతలు ఇంకా ముందుకు రావాలని రాబోయే పన్నెండవ ఆటా కన్వెన్షన్ కనివినని రీతిలో జరుపుకోడానికి ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు.  డా. శ్రీని గంగసాని, చేర్ పర్సన్ ఫండ్ రేజింగ్ కమేటి, మనోహర్  కాసేట్టి (Co Chair Fundraising Committee) మరియు  శేషగిరి రావు మండవ (Chair, Corporate Committee) అందరి నుండి హామీలు పొందడం గమనార్హం.
విందు, వినోదాలు ఘనంగా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాన్ని సత్య  కర్నాటి  (Cultural Committee) మార్గనిర్దేశకత్వంలో నిర్వహించారు. ఎక్కడ తెలుగువారి వేడుకలు జరిగిన అట్లాంటాలో  తన DJ  తో పాటుగా మధురమైన సంగీతాన్ని అందించే రాం దుర్వాసుల  ఇంకా  సీనీ సంగీత దర్శకులు రఘు కుంచె మరియు సీనీ గాయకురాలు విజయ లక్ష్మిలతో  పాటుగా స్థానిక కళాకారులు తమ గాన మాధూర్యాన్ని అందించి ప్రేక్షకుల్ని రసోల్లాసంలో ముంచెత్తారు.

Read More >>

మీడియాకు అమితాబ్ థాంక్స్

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థ గురించి మొట్టమొదటి సారి బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అద్భతంగా స్పందించింది. త్వరలో ఐశ్వర్యారాయ్ డెలివరీ కానుండటంతో దానికి సంబంధించిన ఎటువంటి కథనాలను ప్రసారం చేయరాదని, కాన్పు తర్వాత కూడా అమితాబ్ కుటుంబం ఇస్తే తప్ప ఏ వార్త ప్రసారం చేయరాదని తీర్మానించింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రసవానికి సంబంధించిన వార్తల ప్రసారంపై స్వయంగా మీడియా ఆంక్షల్ని విధించుకోవడంపై అమితాబ్ చాలా సంతోషం, సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నా మనసు తాకిన నిర్ణయమని, మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఐశ్వర్యకు కాన్పు- సంబంధిత వార్తలు, వ్యవహరించాల్సిన తీరు అనే అంశంపై తాజాగా బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తీర్మానంలో సంబంధిత కథనాలు కూడా నియంత్రించడం విశేషం. ఐశ్వర్య పెళ్లికి మీడియా చేసిన హడావుడి, అవమానాల నేపథ్యంలో అసోషియేషన్ ఈ నిర్ణయం తీసుకుంటున్న తెలుస్తోంది.  మొత్తం పది పాయింట్లతో కూడిన ఓ జాబితాను బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ జారీ చేసింది. అందులో ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు, ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ఏ మార్గదర్శకాలు పాటించాలి అన్నది స్పస్టంగా పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ హంగామా ఉండకూడదని కూడా చెప్పింది. ఆస్పత్రి వెలుపల, పరిసరాల్లో బ్రాడ్‌కాస్టింగ్ వ్యాన్లను ఉంచరాదని బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ చాలా విస్పష్టంగా పేర్కొంది.
Read More >>

Wednesday, November 9, 2011

త్యాగాలకు వెనుకాడం

తెలంగాణపై కేంద్రం ఆలస్యం చేస్తే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడబోమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం అనేది తథ్యమని ఆయన అన్నారు. ఉద్యమాన్ని ఆపేది లేదని, ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. త్వరలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణపై ప్రకటన చేస్తామని ఆజాద్ తమకు హామీ ఇచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విజయోత్సవాలు జరుపుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. భేటీలో భవిష్యత్ కార్యాచరణ, తెలంగాణపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
Read More >>

రచ్చబండ అక్కర్లేదు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని కాకుండా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మెదక్
జిల్లాలోని కరువు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కరువు వల్ల నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.10వేల పెట్టుబడి రాయితీ ప్రకటించాలన్నారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయకపోతే తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. చేగుంట మండలం నడిమితండాలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాము కుటుంబాన్ని వెంకయ్యనాయుడు పరామర్శించారు.
Read More >>

మేము కారేక్కం…

టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జైపాల్ యాదవ్, సుద్దాల దేవయ్య ఖండించారు. తాము పార్టీని వీడేది లేదని  స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లోనే కాదని, తాము ఏ పార్టీలోనూ చేరేది లేదని, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని హన్మంత్ షిండే తెలిపారు.  టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే పి. రాములు తెలిపారు. వేరే పార్టీలో చేరబోనని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం పోరాడతానని చెప్పారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో విసిగిపోయిన వీరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Read More >>

కోమటిరెడ్డి దీక్ష విరమణ

రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం నిరాహారదీక్ష విరమించారు. తెలంగాణ కోసం ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ నిమ్స్‌లో ఆయనతో దీక్ష విరమింపజేశారు. కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మందా జగన్నాధం, కేశవరావు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్, విఠల్, దేవీప్రసాద్ దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కోమటిరెడ్డి తొమ్మిది రోజులు పాటు దీక్ష కొనసాగించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తన అంతిమ లక్ష్యం అని దీక్ష విరమించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు, పార్టీ పెద్దల సలహాలతోనే దీక్ష విరమించానని ఆయన తెలిపారు.
Read More >>

చంద్రబాబుపై 420 కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సైబరాబాద్‌ పోలీసులు మంగళవారం చీటింగ్‌ నేరంపై సెక్షన్‌ 420 కింద కేసును నమోదు చేశారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు చీటింగ్‌ చేశారని ఫిర్యాదు చేస్తూ ఇటీవల జనార్దన్‌గౌడ్‌ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో ఆయన మంగళవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాను చేసిన ఫిర్యాదుపై ఎవరూ స్పందించడం లేదంటూ జనార్దన్‌గౌడ్‌ పిల్‌ దాఖలు చేశారు. పిల్‌పై స్పందించిన కోర్టు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
కాగా పక్షం రోజుల క్రితం జనార్దన్‌గౌడ్‌ తెలంగాణకు తాను అనుకూలంగా ఉన్నానని మొదట చెప్పిన చంద్రబాబు కేంద్రం తెలంగాణ ఇచ్చేందుకు ప్రక్రియను ప్రారంభించామని చెప్పిన తర్వాత మాట మార్చి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను చీటింగ్‌ చేశారని ఆరోపిస్తూ జనార్దన్‌గౌడ్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కోర్టు చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చైతన్యపురి పోలీసులను అప్పుడే ఆదేశించింది. అయినప్పటికీ పోలీసులు స్పందించలేదు. దీంతో జనార్దన్‌గౌడ్‌ మరోసారి కోర్టు దృష్టికి విషయాన్ని తీసుకు రావడంతో పోలీసులు కేసును నమోదు చేశారు.
Read More >>

టీఆర్‌ఎస్ లోకి మరో నలుగురు ?

టీఆర్‌ఎస్ లోకి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు సమాచారం.  మంగళవారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావుతో రహస్యంగా వీరంతా సమావేశమైనట్లుగా సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు పి.రాములు, జైపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన హన్మంత్‌రావు షిండే, కరీంనగర్ జిల్లాకు చెందిన సుద్దాల దేవయ్య కేసీఆర్‌ను కలిసినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న రెండుకళ్ల సిద్ధాంతంతో నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదనే ఉద్దేశంతో వారు టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే టీడీపీ వర్గాలు దీనిని ఖండిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి పోయారు. మరో నలుగురు వెళితే తెలంగాణలో టీడీపీకి గడ్డు పరిస్థితులే మిగులుతాయి.
Read More >>

నటనకు గుడ్ బై చెప్పేస్తా ?

‘ ఇది గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్ వున్నంత కాలం మాత్రమే రాణించగలం. వయసు మీదపడ్డాక కూడా నటించాలన్న కోరిక నాకు లేదు. నాకు తెలిసి ఇంకో ఐదారేళ్ళు మాత్రమే నటిగా కొనసాగుతానను కుంటున్నా. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేస్తా’ అంటోంది బాలీవుడ్ నటి కరీనా కపూర్.
గ్లామర్ వున్నప్పుడే అందినంతా దండుకోవాలన్న సామెతని కరీనాకపూర్ బాగా వంటి బట్టించుకున్నట్టుంది. ఈ మధ్య ‘బాడీగార్డ్’, ‘రా.వన్’ చిత్రాలతో బాలీవుడ్ కథానాయికల్లో నెంబర్‌వన్ అనిపించుకున్న కరీనా ప్రస్తుతం ఐశ్వర్యారాయ్ నటించాల్సిన ‘హీరోయిన్’ చిత్రంలో నటిస్తూ అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.  అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదులు కోవాలనుకోవడం లేదు, పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కథానాయికగా నెంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నందుకు ఆనందంగా వుంది. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం నా వంతు కృషి చేస్తున్నాను అని తెలిపింది కరీనా కపూర్.
Read More >>

15 Years of technology progress

Read More >>