Wednesday, November 16, 2011

శాశ్వతంగా చలనచిత్రోత్సవాలు ఇక్కడే : సీఎం

బాలలను విజ్ఞాన గనులుగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం  ప్రణాళికతో ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. మన దేశ జనాభాలో 54 శాతం మంది 25 ఏళ్ళ వయసులోపు వారేనని, లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని యువశక్తిని భావిభారత నిర్మాణానికి వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. పిల్లలను ప్రోత్సహించకుండా దేశాభివృద్ధి సాధ్యపడదని అన్నారు.
 







సోమవారం నాడాయన గచ్చిబౌలిలోని గ్లోబల్‌ పీస్‌ ఫౌండేషన్‌ ఆడిటోరియంలో 17వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.  యావత్‌ దేశంలో బాలల చిత్ర నిర్మాణానికి ప్రవేశ పన్నులేకుండా నిర్మాతకు 30 లక్షల రూపాయల సబ్సిడీని అందిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని,  ప్రభుత్వ సహకారం లేకుండా బాలల చిత్రాలను నిర్మించడం నిర్మాతలకు సాధ్యపడదని అన్నారు.  ప్రభుత్వం చలన చిత్ర అభివృద్ధి సంస్థకు 10 ఎకరాల స్థలం కేటాయించిందని, సదరు స్థలంలో 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నిర్వహించే నాటికి శాశ్వత భవన సముదాయాన్ని సిద్ధం చేస్తామన్నారు.
ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తున్న 152 చిత్రాలు చాలా గొప్పవని, సినిమాల ఎంపికలో విశిష్ట ప్రమాణాలను పాటించారని అభినందించారు. 17వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు హైదరాబాద్ ప్రజలకు గొప్ప అనుభూతులను ఇస్తాయని నందితాదాస్ అన్నారు. బాలబాలికలకోసం యానిమేషన్, సినిమానిర్మాణం, సినిమా దర్శకత్వం, పప్పెట్‌ తయారీ తదితర సృజనాత్మక రంగాల్లో వర్క్‌షాపులు ఏర్పాటు చేశామని, ఇవి వారికి సృజనాత్మక వేదికలు కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సినిమాటోగ్రాఫర్ పిజివిందా దర్శకత్వం వహించిన  ‘లోటస్‌పాండ్’ అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలకు ఎంపికయ్యాయని మంత్రి డీకే అరుణ తెలిపారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి చౌధురి మోహన్‌ జాత్వా మాట్లాడుతూ, ప్రపంచ జనాభా 700 కోట్లు దాటిపోయిన నేపథ్యంలో బాలల సంరక్షణ చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డికె అరుణ, బాలల చలన చిత్రోత్సవం చైర్‌పర్సన్‌, (సిఎఫ్‌ఎస్‌ఐ) నటి నందితాదాస్‌,  సిఎఫ్‌ఎస్‌ఐ సంచాలకుడు సుషోవన్‌ బెనర్జీ, ఎఫ్‌డిసి చైర్మన్‌ అజయ్‌మిశ్ర, సమాచార శాఖ కమీషనర్‌ బి.వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment