Tuesday, October 25, 2011

ఒప్పందంలోని 9 అంశాలు ఇవే..

1. సహాయ నిరాకరణ సందర్భంగా ఈ ఏడాది మార్చి 4న కుదిరిన ఒప్పందం ప్రకారం... రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై పర్యవేక్షణకు ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ... రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అందుబాటులో లేకపోతే, కమిషన్‌కు రిటైర్డ్ జిల్లా జడ్జి నేతృత్వం వహిస్తారు.

2. 'ఎస్మా' విషయానికి వస్తే... సమ్మె కాలంలో ఈ చట్టాన్ని అమలు చేయనే లేదు. కొన్ని శాఖల్లో ఎస్మా కింద సమ్మెను నిషేధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ల ఉపసంహరణ విషయాన్ని సంబంధిత నిబంధనలు, ప్రస్తుత పరిస్థితుల మేరకు పరిశీలించడం జరుగుతుంది.

3. ఉద్యోగులపై నమోదైన కేసులను ఎత్తివేయాలనే అభ్యర్థనకు సంబంధించి... ఆ ఉద్యోగి ప్రత్యక్ష ప్రమేయంలేని క్రిమినల్ కేసులను ఉపసంహరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

4. జీవో నెంబర్ 177 రద్దు విషయం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించి, తదుపరి చర్యలు తీసుకుంటుంది.

5. సకల జనుల సమ్మె సమయంలో జరిగిన డిప్యుటేషన్లు, ట్రాన్స్‌ఫర్లకు సంబంధించి... తిరిగి తమను అదే స్థానాల్లో నియమించాలనే అభ్యర్థనలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుంది.

6. సకల జనుల సమ్మెలో భాగంగా విధులకు గైర్హాజరైన కాలాన్ని 'సగం వేతనంతో కూడిన సెలవు' (హాఫ్ పే లీవ్)తో సహా, మరైదేనా సెలవుగా పరిగణించి, విధుల్లో ఉన్నట్లుగా భావించాలని ఉద్యోగులు కోరారు. ఈ విన్నపాన్ని ప్రభుత్వం అడ్వొకేట్ జనరల్ సలహా, హైకోర్టు ఆదేశాల మేరకు పరిశీలిస్తుంది.

7. నిబంధనల ప్రకారం ప్రభుత్వం 'నో వర్క్ - నో పే'ను అమలు చేయాల్సి ఉంది. అయితే... పండుగలు, సమ్మె కాలంలో జీతాలు నష్టపోయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పెషల్ అడ్వాన్స్ చెల్లిస్తుంది. ఈ స్పెషల్ అడ్వాన్స్ గరిష్ఠంగా ఒక నెల జీతానికి మించదు. ఈ అడ్వాన్స్‌ను తిరిగి ఎలా రికవరీ చేయాలనే దానిపై టీజేఏసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.

8. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగులను తిరిగి నియమించాల్సిందిగా సంబంధిత ఏజెన్సీలను ప్రభుత్వం కోరుతుంది. అది కూడా... సమ్మె కాలంలో తీవ్ర అనుచిత ప్రవర్తనకు పాల్పడని వారిని మాత్రమే!

9. పై అంశాల నేపథ్యంలో, మంగళవారం (25.10.11) నుంచి తిరిగి విధుల్లో చేరేందుకు టీజేఏసీ అంగీకరించి, హామీ ఇచ్చింది.

No comments:

Post a Comment

Thank you for your comment