Tuesday, October 25, 2011

కిరణ్‌కు చెక్ ?


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి చెక్ పెట్టడానికే కాంగ్రెస్ అధిష్టానం డి.శ్రీనివాస్‌కు ఎంఎల్‌సి పదవి  కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరిపై హైకమాండ్‌కు అందిన ఫిర్యాదుల మేరకే ఈ నిర్ణయం  తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణకు, ముఖ్యమంత్రి కిరణ్‌కు మధ్య పొసగడం లేదు. ఇద్దరూ సీమాంధ్ర నేతలు కావడంతో తెలంగాణా కాంగ్రెస్ నేతలను కట్టడి చేసే వారే కరవయ్యారు. దీంతో  తంతే గారెల బుట్టలో పడ్డట్లు డిఎస్‌కు ఎమ్మెల్సీ పదవి వరించింది.
వ్యూహంలో భాగమే…
మాజీ పిసిసి అధ్యక్షుడు డిఎస్‌కు ఎంఎల్‌సి పదవి కేటాయించడం వెనక హైకమాండ్ భారీ వ్యూహమే చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నియమాలకు విరుద్ధంగా డిఎస్‌కు హైకమాండ్ ఈ పదవిని కేటాయించింది. సాధారణంగా సాధారణ ఎన్నికల్లో అభ్యర్ధిత్వం పొంది ఓడిపోతే ఎమ్మెల్సీగాని, రాజ్యసభ సీటు గాని కేటాయించే సంప్రదాయం కాంగ్రెస్‌లో లేదు. గతంలో డిఎస్ ప్రయత్నించినా ఇదే అభిప్రాయాన్ని హైకమాండ్ వెల్లడించింది. అంతేకాకుండా నిజామాబాద్‌కు జరిగిన సాధారణ ఎన్నికల్లో, ఉపఎన్నికల్లోనూ డిఎస్ ఓటమి పాలయ్యారు. అందుకు అసలు డిఎస్‌కు ఈ పదవి ఇవ్వడం కష్టమని అనేకమంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. అయితే అందరి అంచనాలను తారుమారూ చేస్తూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది.
మరో పవర్ సెంటర్….
కాంగ్రెస్‌లో డిఎస్ మరో పవర్ సెంటర్‌గా మారనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స పవర్ సెంటర్లుగా మారారు. సిఎం మాట బొత్స వినని పరిస్థితి. బొత్స ఊసు కూడా సిఎం ఎత్తని స్థితి. ఎవరి పర్యటనలు వారివి. ఎవరి మార్గాలు వారివి. ఇద్దరూ హైకమాండ్‌తో సత్సంబంధాలు నెరుపుతూ నెట్టుకొస్తున్నారు. ఇక సిఎం అయితే కాంగ్రెస్ సీనియర్లను ఏమాత్రం లేక్క చేయడం లేదన్న విమర్శ ఉంది. అదీ తెలంగాణా ప్రాంత నేతలను సిఎం అసలు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు అనేకం హైకమాండ్‌కు అందాయి. ఇటీవల జరిగిన రైల్ రోకో సందర్భంగా కూడా ఎంపీలపై పెట్టిన కేసులు కూడా వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఎంపీలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు కూడా. ఇవన్నీ ఆలోచించిన అధిష్టానం తెలంగాణా కాంగ్రెస్ నేతలకు పెద్దదిక్కు కరవయ్యారన్న ఆలోచనలో పడింది. కేకే, జానారెడ్డిలు కూడా అధిష్టానానికి విశ్వాసపాత్రులు కాలేకపోయారు. దీంతో హైకమాండ్‌కు పూర్తి విధేయతతో ఉన్న డిఎస్‌ను ఎంఎల్‌సి స్థానానికి ఎంపిక చేసింది. భవిష్యత్తులో ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చినా తెలంగాణా కాంగ్రెస్ నేతలకు కేటాయించాల్సి వస్తే ఆ అభ్యర్ధి డిఎస్ అవుతాడనండంలో ఆశ్చర్యం లేదు. అందుకే డిఎస్ అభ్యర్ధిత్వాన్ని జానారెడ్డి, కేకే లాంటి నేతలు వ్యతిరేకిస్తున్నారు.
మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ కిరణ్‌కు చెక్ పెట్టడానికే డిఎస్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది

No comments:

Post a Comment

Thank you for your comment