Tuesday, October 25, 2011

మరోపోరుకు 'సై'నా

న్యూఢిల్లీ: గతవారంలో జరిగిన డెన్మార్క్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్‌లోనే నిష్క్రమించిన హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌కు సిద్ధమైంది. ఈ టోర్నీ మంగళవారం ప్రారంభమవుతుంది. డెన్మార్క్ టోర్నీలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా సైనా ఈ టోర్నీలో జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. ఎందుకంటే బుధవారం నాటి మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో హాలెండ్‌కు చెందిన జీ యావోతో సైనా ఆడుతుంది.

ఈ మ్యాచ్ అంత సులభమైందేమీ కాదు. ఎందుకంటే సైనాపై జీ యావో కు 2-1 రికార్డు ఉంది. 2006 మలేసియా ఓపెన్‌లో, 2009 హాంకాంగ్ ఓపెన్‌లో సైనాను జీ యావో ఓడించింది. ఇక పురుషుల విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత పారుపల్లి కశ్యప్ తొలి మ్యాచ్‌లో కొరియాకు చెందిన వాన్ హో షోన్‌తో తలపడనుండగా.. క్వాలిఫయర్‌తో అజయ్ జయరామ్ ఆడనున్నాడు.

డబుల్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక జోడీ గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప.. కొరియా జంట యుంగ్ ఇయున్ జంగ్, హ న కిమ్‌తో తొలి మ్యాచ్‌లో ఆడనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో దిజు, జ్వాల ద్వయం ఇండోనేషియాకు చెందిన మూడో సీడ్ టొంటొవి అహ్మద్, లిలియానా జోడీతో పోరాడనుంది.

పురుషుల డబుల్స్ జోడీ రూపేష్ కుమార్, సనవే థామస్.. తొలి మ్యాచ్‌లో అంగా ప్రటమ, రియాన్ అగంగ్ (ఇండోనేషియా)తో ఆడనుంది. ఇక క్వాలిఫయింగ్‌ల్లో ఆనంద్ పవార్.. డేన్ జోచిమ్‌తో, గురుసాయిదత్.. స్టానిస్లావ్‌తో ఆడనుండగా.. చేతన్ ఆనంద్ క్వాలిఫయర్‌తో ఆడనున్నాడు.

No comments:

Post a Comment

Thank you for your comment