Wednesday, November 2, 2011

ఆందోళనలో హైకమాండ్

తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం కాంగ్రెస్ హైకమాండ్ ను  ఆందోళన పడేసింది. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, రాజయ్య,   బయటినుంచి మద్దతిస్తున్న మరో ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోవటం, మరికొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వలసపోయే ఆలోచనలో ఉన్నారన్న సమాచారం హైకమాండ్‌ను ఆలోచనలో పడవేసిందని అంటున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి అధిష్టానం లోతుగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావును ఢిల్లీ పిలిపించారు. ఆదివారం రాత్రే ఢిల్లీ చేరుకున్న కెవిపితో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, లోక్‌సభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్‌ను సైతం కలిసి కెవిపి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు  ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి ? ఇంకా ఎంతమంది పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధపడొచ్చు? అలాంటి పరిస్థితి ఎదురైతే బయట పడేందుకు ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం ఉందా? అనే అంశాలపై చర్చలు జరిగాయని తెలుస్తోంది.  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పని తీరు, ఇరువురి మధ్యా కొనసాగుతున్న రాజకీయ శత్రుత్వం తదితర అంశాలూ చర్చకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో పరిస్థితులు చేజారక ముందే చర్యలు తీసుకోవాలని, మరింత మంది వలసబాట పడితే అధికారపార్టీ అది తమకు అవమానకరంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. అందుకే బక్రీద్ తరువాత తెలంగాణ విషయం తేలుస్తామని చిదంబరం ప్రకటించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేలు పార్టీని వీడటం హైకమాండ్ కు షాక్ అనే చెప్పొచ్చు.

No comments:

Post a Comment

Thank you for your comment