Friday, November 4, 2011

సీన్ రివర్స్ !

గులాబీ జట్టులోకి మరో ఐదుగురు?  
నవంబరు 5 ముహూర్తం !
గులాబి జట్టులోకి మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వెళ్లనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచే టిఆర్ఎస్‌లోకి చేరనున్నారు. రెండు రోజుల్లో వీరు టిఆర్ఎస్‌లో అధికారికంగా చేరుతున్నట్లు సమాచారం.
మామ ప్లాన్ వేస్తే, అల్లుడు అమలు చేస్తారు… మామ స్కెచ్ గీస్తే అల్లుడు  రూపం ఇస్తాడు…వాళ్లే కేసీఆర్, హరీహ్‌రావు. గతంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరిట వైఎస్ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరుకున్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. గతంలో వైఎస్ మంత్రమే…. ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌రెడ్డి రెండో సారి  అధికారంలోకి  వచ్చిన తరువాత ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ప్రయోగించారు.. అటు టిడిపి, ఇటు టిఆర్‌యస్‌లకు చెందిన చాలా మంది నాయకులు వైయస్ పంచన చేరారు. ఒక దశలో టిఆర్‌యస్‌కు చెందిన ముఖ్య నేత వైయస్‌తో మంతనాలు జరపడం అప్పట్లో కలకలం సృష్టించింది . అంతకు ముందే 2006లో టిఆర్‌యస్‌ను చీల్చడానికి వైయస్‌ వేసిన ఎత్తులు కొంత వరకు సఫలం అయ్యాయి.  అప్పుడు టిఆర్‌యస్‌కు ఉన్న 26 మంది ఎంఎల్ఏలలోపదిమంది బైటకి వచ్చి కేసిఆర్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసారు. 2009లో రెండో సారి సాదారణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైయస్‌ టిఆర్‌యస్, టిడిపి నాయకులను పార్టీలోకి లాగడానికి ఆకర్ష్‌ ను అమలు చేసారు. వైయస్ ఆకర్ష్‌లో స్కెచ్ రాజశేఖరరెడ్డి గీస్తే, కెవిపి అమలు చేసేవారు. కానీ ప్రస్తుతం సీన్ రీవర్స్ అయింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజకీయంగా పట్టు సాధించిన టిఆర్‌యస్  అప్పటి వైయస్ సూత్రాన్ని అమలు చేస్తోంది. అప్పుడు వైయస్ ఆర్ కేవిపి పోషించిన పాత్రలను ఇప్పుడు టిఆర్‌యస్ అధినేత కెసిఆర్, ఆ‍యన మేనల్లుడు హరీష్ రావులు పోషిస్తున్నారు.అప్పట్లో ఆకర్ష్ కి  టిఆర్‌యస్ మనుగడ ప్రశ్నార్థకం అయితే ఇప్పుడు ఆపరేషన్‌ గులాబీకి  తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని సవాల్ చేసే విధంగా  తయారయ్యింది.
కేసీఆర్ కసరత్తు….
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి కేసీఆర్ పెద్ద కసరత్తే చేస్తున్నారు.  తెలంగాణ వ్యాప్తంగా ఏఏ ప్రాంతాల్లో ఉద్యమ ప్రభావం ఎక్కువగా ఉందీ… ఏఏ ఎమ్మెల్యేలు సెంటిమెంట్‌ను తప్పించుకోలేకపోతున్నారు… పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఏ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారో అనే విషయాలు ఎప్పటికప్పుడు కెసిఆర్ ఆరా తీస్తున్నారు. వారిని పార్టీలోకి తీసుకవచ్చే బాధ్యతను హరీష్ రావు నిర్వహిస్తున్నాడన్నది బహిరంగంగా కనిపిస్తున్న దృశ్యం. ఈ మధ్యే టిడిపి తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, మాజీ యంపి జితేందర్ రెడ్డిలు హరీష్‌రావుతో ప్రాథమిక చర్చలు జరిపిన తరువాతే, కెసిఆర్‌తో కలసి చర్చించి నిర్ణయం ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన టిడిపి నేత గంప గోవర్థన్‌ను స్థానిక నేత పోచారంతో కలసి ఒప్పించింది కూడా హరీష్ రావే. 
టిడిపి నుంచి బయటకు వచ్చి స్వతంత్ర్యంగా ఉన్న జోగురామయ్యను సైతం టిఆర్‌యస్‌లోకి లాగింది హరీష్‌ రావే… నాగం జనార్థనరెడ్డితో కలసి పార్టీని వీడిన రామన్న, నాగంతో కలసి ఇమడలేకపోతున్నాడనే విషయం గ్రహించిన హరీష్ రావు, తమ పార్టీ యల్పీ నేత ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌తో కలసి రామన్నను టిఆర్‌యస్‌ చేర్చడానికి కృషి చేశారు. తాజగా జూపల్లి కృష్ణారావు, సోమారపు సత్యనారాయణ, రాజయ్యలను గులాబీ వనంలోకి లాక్కురావడానికి హరీష్ రావు ఐదు నెలల పాటూ శ్రమించినట్టు సమాచారం. చివరి రోజుకు కూడా తెల్లవారుఝాము నుంచీ ఆ ముగ్గురూ పార్టీకి, పదవికీ రాజీనామా చేసి, కెసిఆర్ ఇంటికి వచ్చే వరకూ హరీష్ రావు వారిని వారి వెంటే ఉన్నారు. అయితే ఈ మామా అళ్లుళ్ల ఆపరేషన్ గులాబీ ఇంకా ఉందని కెసిఆర్ ప్రకటనలోనే తెలుస్తోంది. తెలంగాణలో మరో పార్టీ జెండాను  లేకుండా చేస్తామని గులాబీ బాస్ ధీమాగా  చెబుతున్న మాటలు ఇందుకు ఊతమిస్తున్నాయి.
ఇంకెందరు?
నవంబర్ 5 తరువాత టిడిపి, కాంగ్రెస్‌లకు సంబంధించిన ఐదుగురు ప్రజాప్రతినిధుల మెడలో గులాబీ కండువా వేయడానికి రంగం సిద్ధం చేశారు ఈ మామా అళ్లళ్లు… వీరిలో ఇద్దరు కాంగ్రెస్ యంపీలు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం హరీష్ రావు ఈ ప్రయత్నంలోనే ఉన్నారు. హరీష్ రావు ప్రతీ ఒక్కరినీ వ్యక్తిగతంగా కలసి, మాట్లాడుతూ, అవసరమైతే హరీష్‌ రావే స్వయంగా ఫోన్‌లైన్ కలిపి కెసిఆర్‌తో మాట్లాడిస్తూ ఆయా నేతలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఇదే ఆకర్ష్ పథకానికి బాధిత పార్టీగా ఉండి విలవిల్లాడిన టిఆర్‌యస్ ఇప్పుడు కాంగ్రెస్‌పై రివెంజ్ తీర్చుకుంటున్నట్టు కనబడుతోంది… అంతే కాదు పనిలో పనిగా టిడిపి అధినేతకు కూడా చెమటలు పట్టిస్తోంది.

No comments:

Post a Comment

Thank you for your comment