Friday, November 4, 2011

మాట నిలబెట్టుకున్న కేజ్రీవాల్

సామాజిక ఉద్యమకారుడు కేజ్రీవాల్ మాట తప్పలేదు. పదవీ విరమణకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.9 లక్షలనూ అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం చెల్లించారు. నిరసన వ్యక్తం చేసేందుకే తాను ఆ డబ్బును చెల్లిస్తున్నానని, ఇందులో తన తప్పు ఉన్నట్లుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు.
రూ.9, 27, 787 విలువతో కూడిన చెక్‌ను ఓ లేఖకు జతచేసి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు పంపారు. వడ్డీలేకుండా తనకు రుణమిచ్చిన మెగసేసే అవార్డు గ్రహీత హరీష్‌ హండే మరో అయిదుగురిని ఎటువంటి వేధింపులకూ గురిచేయవద్దని ఆయన ప్రధానిని కోరారు. అన్నా బృందంపై విమర్శలు చేస్తున్న వారి నోళ్లు మూయించేందుకే కేజ్రీవాల్‌ ఈ చెల్లింపులు చేసినట్లు అర్థమవుతోంది.
”మీకు రూ.9.27 లక్షలకు చెక్కు పంపుతున్నాను. దీనర్థం నా తప్పును అంగీకరించినట్లు కాదు. నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. అందువల్ల తప్పు జరిగినట్లుగా అంగీకరించడం లేదు” అని కేజ్రీవాల్‌ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన అప్పు చెల్లించేందుకు చాలా మంది ముందుకు వచ్చినా… వారి నుంచి డబ్బు తీసుకోలేదని, అలా చేసినట్లయితే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఉపయోగించుకున్నట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment