Saturday, November 5, 2011

మొగుడు సినిమా రివ్యూ

కృష్ణవంశీ ఏం చేస్తాడు.. కొత్తగా ఆలోచిస్తాడు. తాను నమ్మింది తీస్తాడు. కాంప్రమైజ్ కాడు. లవ్-కిడ్నాప్ నేపథ్యంలో ఒక గులాబి, కుటుంబ బంధాల కలబోతతో ఒక నిన్నే పెళ్లాడతా, తీవ్రవాదం బ్యాక్ డ్రాప్ లో ఒక సింధూరం.. ఇలా ఆరంభంలో అతని సినిమాలు వేటికవే డిఫరెంట్. కానీ ఈ క్రియేటివ్ డైరెక్టర్ సృజనాత్మకత మురారి దగ్గరే ఆగిపోయింది. ఆ సినిమాలో తెలుగు సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ బంధాల్ని చక్కగా చూపించి.. ఆంధ్ర ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన కృష్ణవంశీ తర్వాత ఆ ‘బంధా’ల్లోనే చిక్కుకుపోయాడు. చందమామ, శశిరేఖా పరిణయం.. తాజాగా మొగుడు.. అన్నింట్లోనూ ఒకటే పాయింట్. ఒక పెళ్లి, రెండు కుటుంబాలు, ఇద్దరి మధ్యా గొడవలు.. ఏడుపులు.. ఎమోషన్లు.. చివరికి కథ సుఖాంతం. ఇదీ కథ. అంతేనా కృష్ణవంశీ అంటే?
వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి పైకొచ్చిన తన తండ్రి ఆంజనేయ ప్రసాద్ (రాజేంద్రప్రసాద్) గురించి రాంప్రసాద్ అలియాస్ బుజ్జి (గోపీచంద్) ఉపోద్ఘాతంతో మొదలవుతుంది కథ. రాష్ట్రపతి చేత కృషి పండిట్ అవార్డునందుకున్న ఆంజనేయప్రసాద్ కు ముగ్గరు కూతుళ్లు, ఒక కొడుకు. ముగ్గురమ్మాయిల్నీ బాగా చదివించి వారికి పెళ్లిళ్లు చేస్తాడు ఆంజనేయప్రసాద్. అల్లుళ్లు కూడా అతనితో పాటే ఉంటారు. కొడుకు బుజ్జి కూడా బాగా చదువుకుని మెర్సిడెజ్ బెంజ్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తుంటాడు. ఇక కొడుక్కి పెళ్లి చేయడమొక్కటే ఆంజనేయ ప్రసాద్ కి ఉన్న బాధ్యత. కానీ బుజ్జికి పెళ్లంటే ఇష్టం ఉండదు. తండ్రి బలవంతంతో ఒప్పుకుంటాడు. చూసిన సంబంధాలు నచ్చవు. అనుకోకుండా రాజేశ్వరి (తాప్సి)ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె కూడా ఇతణ్ని ప్రేమిస్తుంది. రాజేశ్వరి తల్లి చాముండేశ్వరి (రోజా) రాజకీయ నాయకురాలు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి జరిగిపోతుంది. కానీ అప్పగింతల సమయంలో చిన్న మాటా మాటా వచ్చి ఇరు కుటంబాలకు గొడవ జరుగుతుంది. అది కాస్తా పెద్దదై ఒకళ్లపై ఒకళ్లు చేయి చేసుకుంటారు. అంతే.. రాజేశ్వరి తాళి తీసి మొహాన కొడుతుంది. ఇదీ ప్రథమార్ధం. ఇక ద్వితీయార్ధంలో జరిగే కథేంటో సులభంగా ఊహించేయచ్చు. మళ్లీ ఈ జంట ఎలా ఒక్కటయింది. రెండు కుటుంబాలు ఎలా కలిశాయి? అన్నదే మిగతా కథాంశం.
ఇంటర్వెల్ కు ముందొచ్చే సన్నివేశం సినిమాకు ఆయువు పట్టని కృష్ణవంశీ నమ్మాడు. నిజమే.. ప్రేక్షకుడు అత్యంత ఆసక్తి సినిమాపై దృష్టిపెట్టింది అక్కడే. కానీ ఆ ఒక్క పాయింట్ ను నమ్మకుని.. అటూ ఇటూ అర్థం లేని, రొటీన్ సన్నివేశాలతో నింపేస్తే. అందులోనూ ఆ పని కృష్ణవంశీ చేస్తే. వరుసగా ఫ్లాపులొస్తున్నా.. క్రియేటివిటీకి గుడ్ బై చెప్పేసి చాలా కాలమైనా ఇప్పటికీ కృష్ణవంశీ పేరు చూసి సినిమాలకొచ్చే జనాలున్నారు. కానీ వారిని తీవ్రంగా నిరాశ పరిచింది మొగుడు. కుటుంబంలోని వారంతా ఈడుకొచ్చిన కుర్రాడికి పెళ్లి చేయాలని చూడటం.. అతనేమో వద్దు వద్దనడం.. ఆనక ఓ అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకోవడం.. ఎవర్ని చూసినా ఆ అమ్మాయే అనుకోవడం.. తర్వాత ఓ డ్రీమ్ సాంగేసుకోవడం.. హీరోయిన్ ను కూడా లవ్ లో పడేయడం.. తర్వాత పెళ్లి. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ప్రథమార్ధమంతా ఈ సన్నివేశాలకే సరిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ తో కథ దార్లోకి వచ్చిందిలే.. ఇంకేం జరుగుతుందో చూద్దామని సెకండాఫ్ లోకి వెళ్తే.. ఏముంది.. మళ్లీ పాత కథే. హీరో, హీరోయిన్ ఫారిన్ వెళ్తారు. అక్కడ సెకండ్ హీరోయిన్ ఎంట్రీ. జలసీతో హీరోయిన్ కు, హీరోకు గొడవ. తర్వాత ఇద్దరూ ఒకటైపోతారు. ఆపై క్లైమాక్స్. ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండిస్తాడని కృష్ణవంశీకి పేరు. కానీ అతకని సన్నివేశాలతో ఈ సినిమాలో ఎమోషన్స్ పండలేదు. చాలా సన్నివేశాల్లో నటీనటులు ఓవర్ గా రియాక్టవుతున్నట్లు, ఓవరాక్షన్ చేస్తున్నట్లు అనిపించిందంటే.. అందుకు సన్నివేశాల్లో బలం లేకపోవడమే కారణం.

ట్రైలర్స్, పోస్టర్స్ చూసి ‘మొగుడు’లో తాప్సి ప్రధాన ఆకర్షణ అవుతుందనుకుంటే.. పెద్ద మైనస్ అయి కూర్చుంది. ఆమెతో డబ్బింగ్ చెప్పించడం దర్శకుడు చేసిన పెద్ద తప్పు. మిస్టర్ పర్ఫెక్ట్ లో అయితే ఆమె మోడర్న్ గర్ల్ కాబట్టి, ఫారిన్లో ఉంటుంది కాబట్టి వంకర టింకర తెలుగు మాట్లాడితే ఓకే. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ, శాస్త్రీయ నృత్యం నేర్చుకునే తెలుగింటి అమ్మాయి తెలుగును పరమ ఘోరంగా మాట్లాడుతుంటే విని ఎలా తట్టుకోవాలి? అసలు తెలుగంటే, తెలుగింటి సంప్రదాయాలంటే మక్కువ చూసే కృష్ణవంశీకి తాప్సితో డబ్బింగ్ చెప్పించాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో. యాక్షన్ కి, ఆమె చెబుతున్న డైలాగులకి లంకె కుదరక.. ఎమోషన్స్ పండక.. ఎప్పుడెప్పుడు సినిమా ముగుస్తుందా అన్న ఇబ్బందిలో పడిపోయాడు ప్రేక్షకుడు. తాప్సికి వేసిన మేకప్ కూడా చాలా సందర్భాల్లో బాగాలేదు. క్లాసికల్ డ్యాన్స్ చేసే అమ్మాయి పబ్బుల్లో పడి తాగడం, నడుంపై టాటూ వేయించుకోవడమేంటో? ఇక గోపీచంద్ కూడా పెద్దగా చేసిందేం లేదు. ఎమోషనల్ సీన్స్ లో అతని నటన బాగుంది కానీ.. వాయిస్ మైనస్ గా మారింది. ఎక్స్ పోజింగ్ లో శ్రద్ధాదాస్ తో పోటీపడ్డాడు గోపీచంద్. రెండు పాటల్లో అతనికి చొక్కానే ఉండదు. రాజేంద్రప్రసాద్ బాగా చేశాడు. కానీ సీరియస్ సన్నివేశాల్లో అతను సడెన్ గా అమాయకంగా మారిపోతుంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అందర్లోకి రోజా నటన బాగుంది. బాబు శంకర్ సంగీతం ఓకే. పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. రాధాకృష్ణన్ శైలిలో సాగాయి అతని పాటలు.
అసలైన మొగుడు ఎలా ఉండాలో చూపిస్తాం అన్నాడు కృష్ణవంశీ. కానీ ఈ సినిమాలో ఆ పాయింటే లేదు. ఉన్నదంతా రెండు కుటుంబాల గొడవలే.
రేటింగ్- 1.5/5

No comments:

Post a Comment

Thank you for your comment