సూర్య, శృతిహాసన్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన సెవెన్త్ సెన్స్ చిత్రాన్ని శ్రీ
లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై సుబ్రమణ్యం ఇటీవల తెలుగు ప్రేక్షకులకు
అందించారు. కాగా మొదటి సన్నివేశం నుంచి శుభం కార్డు పడేవరకు ఈ చిత్రాన్ని
చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేశానని మంగళవారంనాడు హైదరాబాద్‌లోని సినీమాక్స్‌లో
జరిగిన విజయోత్సవ సభలో నటుడు శ్రీహరి అన్నారు. లోగడ సూర్య నటించిన
చిత్రాలు చూశానని, ఆయన నటన తననెంతగానో ఆకట్టుకుంటుందని చెబుతూ తాను ఆయన
అభిమానినని శ్రీహరి చెప్పారు.
హీరో సూర్య మాట్లాడుతూ, ‘ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడులో కూడా ఈ
చిత్రానికి అద్భుతమైన ఓపనింగ్స్ వచ్చాయి. ఇందులో బౌద్ధధర్మ పాత్ర చేయడం నా
కెరీర్‌లోనే మరచిపోలేని అంశం. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా లభిస్తుంటాయి.
నేను నటించిన ఐదు ఉత్తమ చిత్రాలలో ఇదొకటి’ అని చెప్పగా, ‘ఈ చిత్రంలో నన్ను,
నాపాత్రను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సూర్య ఎంతగానో సహకరించారు’
అని కథానాయిక శృతిహాసన్ అన్నారు.
మరో అతిథి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, ‘ఆరు రోజుల్లో నైజాంలో ఈ
చిత్రం 4 కోట్ల 25 లక్షలు వసూలు చేసింది. ఏడు రోజులకు ఆంధ్రప్రదేశ్‌లో 12
కోట్లు వసూలు చేయడం ఓ విశేషం. ఇక సూర్య కథానాయకుడిగా కె.వి.ఆనంద్
దర్శకత్వంలో నేను నిర్మాతగా ఓ చిత్రం చేయబోతున్నాను’ అని పేర్కొనగా,
‘మొదటిరోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత చక్కటి
చిత్రంగా పేరొచ్చింది. ఓ పెద్ద హీరో సినిమాకు, ఓ స్ట్రయిట్ సినిమాకు
వచ్చినట్లుగా ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
చిత్ర నిర్మాత సుబ్రమణ్యం మాట్లాడుతూ, ‘ఈ చిత్రం కలెక్షన్లను ముందుగా
ఊహించినప్పటికీ, ఇంత భారీస్థాయిలో ఉంటాయని మేము అనుకోలేదు. ప్రతి భారతీయుడు
చూడాల్సిన చిత్రమిది. ఈ చిత్రంతో మా సంస్థ విలువ మరింత పెరిగింది’ అని
అన్నారు. ఇంకా ఈ సమావేశంలో నిర్మాత కిరణ్, రచయిత శశాంక్ వెన్నెలకంటి
తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment