Tuesday, November 1, 2011

కోమటిరెడ్డి ‘దీక్షాస్త్ర్రం’

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టనున్నారు. నల్గొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో ఆయన చేపట్టనున్న దీక్ష నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు సోమవారం పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయని నేపథ్యంలో కోమటిరెడ్డి తన మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామాలను సమర్పించారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్టోబర్‌ 2వ తేదీ నుంచే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్షను కొనసాగిస్తామని ప్రకటించినప్పటికీ సకల జనుల సమ్మె కారణంగా దీక్షను వాయిదా వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఈయన దీక్షా కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యులు హాజరు కానున్నారు. కోమటిరెడ్డి దీక్ష నేపథ్యంలో నల్గొండ, మునుగోడు, నకిరేకల్‌తో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి సుమారు లక్షల మందికి పైగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, తెలంగాణ వాదులు తరలి వచ్చేలా ఆయన అనుచర గణం అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిమగ్నమైంది.
నిరాహార దీక్షకు తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్‌, సుమారు 140కి పైగా ప్రజా, ఉద్యోగ సంఘాల జెఎసిలు ఇప్పటికే మద్దతును ప్రకటించాయి. ఈ దీక్షకు పోలీస్‌ శాఖ పది రోజుల పాటు అనుమతినిచ్చింది.  కోమటిరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామాను సమర్పించి ఆమోదింప చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన శాసన సభ్యులు జిల్లాలో రెండు వర్గాలుగా చీలిపోయారు. ఆమరణ దీక్షను విరమించుకోవాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరినప్పటికి కోమటిరెడ్డి పట్టించుకోలేదు.

No comments:

Post a Comment

Thank you for your comment