Wednesday, November 2, 2011

తెలంగాణ ‘దీక్ష’లు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ నల్గొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఢిల్లీలో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ మంగళవారం నిరశన దీక్షలు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కేంద్రంలో వేలాది మంది తెలంగాణ వాదుల సమక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో కోమటిరెడ్డి మెడలో తెలంగాణ కోసం అమరుడయిన కాసోజు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ పూలమాల వేసి దీక్షను ప్రారంభింపచేశారు. దీక్ష చేపట్టిన క్లాక్‌ టవర్‌ సెంటర్‌ తెలంగాణ నినాదాలతో మార్మోగింది. వక్తల ప్రసంగాలు ఐదు గంటల పాటు నిర్విరామంగా సాగాయి. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ప్రాణహాని వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమ సమాచారాన్ని కేంద్రానికి తప్పుగా పంపుతూ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ముఖ్యమంత్రి కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేల అడ్డంకి అన్నారు. వారికి చీము, నెత్తురు ఉంటే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజా ఉద్యమంలో మమేకం కావాలన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రోడ్‌ మ్యాప్‌ను ప్రకటించేవరకు ఆమరణ దీక్షను కొనసాగిస్తానన్నారు.
కొండా లక్ష్మణ్‌ బాపూజీ దీక్ష
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామన్న ప్రకటనను అమలు పరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ మంగళవారంనాడిక్కడ వారం రోజుల నిరశన దీక్షను ప్రారంభించారు.  స్థానిక జంతర్‌ మంతర్‌ వద్ద ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించిన దీక్షను దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులను కాపాడేందుకు చేపట్టిన సత్యాగ్రహంగా అభివర్ణించారు.
తెలంగాణ విషయంలో కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే ఇప్పటి వరకూ శాంతియుతంగా సాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను ప్రభుత్వాలు గౌరవించాల్సి ఉందంటూ 2009 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. దీక్షను ప్రారంభించడానికి ముందుగా ఆయన ఉదయం రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పించారు.

No comments:

Post a Comment

Thank you for your comment