Tuesday, November 1, 2011

అజారుద్దీన్ బూతుల వల్లే సిద్దూ అలా చేశాడా..?


Navjot Singh Sidhu-Mohammad Azharuddinవివాదాస్పద వ్యాఖ్యలతో ఆత్మకథలు వెలువరిస్తున్న అనేక మంది క్రికెట్ ప్రముఖుల జాబితాలో ఇప్పుడు బీసీసీఐ మాజీ కార్యదర్శి జేవై లెలె కూడా చేరాడు. ‘ఐ వజ్ దేర్- మెమరీస్ ఆఫ్ ఎ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్’ పేరుతో రాసిన తన ఆత్మకథలో లెలె ప్రత్యేకంగా ఒక సంఘటనను ప్రస్తావించారు.. ‘ఇది మ్యాచ్ ఫిక్సింగ్‌లాంటిది కాదు, అయితే ఈ ఘటన కొందరు వ్యక్తుల విశ్వసనీయతపై అనుమానం రేకెత్తించింది’ అంటూ మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌పై విమర్శలు ఎక్కుపెట్టాడు. ఫిక్సింగ్‌పై అప్పట్లో కపిల్‌పై వచ్చిన అనుమానాలకు బలం చేకూర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం.

ఇది మాత్రమే కాకుండా ఇంకెన్నో, మరెన్నో విషయాలు తన ఆత్మకథలో లెలె ప్రస్తావించారు. అది 1996వ సంవత్సరం. అప్పుడు జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో భారత ఓపెనర్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ అర్ధాంతరంగా వెనుదిరగడం అప్పట్లో భారత క్రికెట్లో సంచలనం సృష్టించింది. దీనిపై స్పష్టమైన కారణం ఏమిటో ఇప్పటివరకు సిద్ధూ చెప్పకపోయినా...అప్పటి జట్టు కెప్టెన్ అజహరుద్దీన్‌తో విభేదాలే సమస్య అనేది బహిరంగ రహస్యం. ఈ ఘటనను లెలె తన ఆత్మకథలో ప్రస్తావించాడు. ఆయన చెప్పినదాని ప్రకారం సిద్ధూ టూర్ నుంచి వెనక్కిరావడంపై తొలుత బోర్డు ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసినా ఎలాంటి ఫలితం రాలేదు. తాను ఏ విషయమూ చెప్పనని సిద్ధూ మొండికేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కాలంలో విచారణ సంఘంలో ఒక పంజాబీ వ్యక్తి ఉండేలా మరో విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసినా సిద్ధూ నోరు విప్పలేదు. ఈ సందర్భంగా ఎలాగైనా సిద్ధూ చేత కారణం కనుక్కోవాలని మాజీ కెప్టెన్ మొహిందర్ అమర్‌నాథ్ భావించాడు. ఇద్దరూ విడిగా పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు. ఈ సమయంలో సిద్ధూ నోరు విప్పాడు. అజహర్ తనను మాటలతో వేధించాడన్నాడు. ‘ప్రతీ రోజు గుడ్‌మార్నింగ్‌తో పాటు ‘మాకీ......’ అంటూ అజహర్ నన్ను బూతులు తిట్టడం ప్రారంభించాడు. అతని తిట్లు తినేందుకు నేను రాలేదు. అందుకే టూర్‌నుంచి వచ్చేశాను’ అంటూ సిద్ధూ మనసులో మాట చెప్పాడు. అయితే అది బూతు కాదని, అజహర్ సొంత ఊరు హైదరాబాద్‌లో సన్నిహితులతో మాట్లాడేటప్పుడు చాలా సార్లు ఈ పదం ఉపయోగించేవాడట. ఇదే విషయాన్ని అమర్‌నాథ్... సిద్ధూకి వివరించాడని లెలె తన పుస్తకంలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment