Wednesday, November 2, 2011

సునీల్ జోషీ, వెంగ్ సర్కార్‌లకు తెలంగాణ సెగ

Sunil Joshi
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వెంగ్ సర్కార్‌కు, హైదరాబాద్ క్రికెట్ జట్టు కోచ్ సునీల్ జోషీకి సోమవారం తెలంగాణ సెగ తగిలింది. జట్టు ఎంపిక తీరును తప్పు పడుతూ తెలంగాణ క్రికెట్ జెఎసి నాయకులు ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఆందోళనకు దిగడంతో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) చిక్కుల్లో పడింది. సోమవారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ రంజీ జట్టు కోచింగ్‌ను పరిశీలించడానికి వచ్చిన వెంగ్ సర్కార్ ఏం జరుగుతోందో తెలియక నివ్వెరపోయారు.

జిమ్మీ బాబు నాయకత్వంలోని తెలంగాణ క్రికెట్ జెఎసికి చెందిన ఎనిమిది మంది మైదానంలోకి ప్రవేశించి వికెట్లను తొలగించారు. తొలి రెండు మ్యాచులకు జరిగిన జట్టు ఎంపికను వారు తప్పు పట్టారు. తిరుమల శెట్టి సుమన్‌ను జట్టులోకి తీసుకుంటే తప్ప జార్ఖండ్‌తో జరిగే మ్యాచును జరగనివ్వబోమని తెలంగాణ క్రికెట్ జెఎసి నాయకులు అన్నారు. తొలుత ప్రణీత్ కుమార్‌ను ఎంపిక చేసి ఆ తర్వాత హైదరాబాద్ అండర్ - 22 జట్టులోకి పంపడాన్ని కూడా వారు తప్పు పట్టారు. ఫామ్‌లో లేకపోయినప్పటికీ శశాంక్ నాగ్‌ను ఎందుకు జట్టులోకి తీసుకున్నారని వారు ప్రశ్నించారు.

ఆందోళనకారులతో హైదరాబాద్ రంజీ జట్టు చీఫ్ కోచ్ సునీల్ జోషీ వాగ్వివాదానికి దిగారు. నువ్వు కోచ్‌గా ఉండాల్సిన అవసరం లేదనీ, నీ కోచింగ్ నైపుణ్యాన్ని కర్ణాటకలో చూపాలని ఆందోళనకారులు సునీల్ జోషీతో అన్నారు. కొద్దిసేపటికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.

No comments:

Post a Comment

Thank you for your comment