Sunday, October 30, 2011

పిల్ల జమీందార్ రివ్యూ

నటీనటులు- నాని, హరిప్రియ, బింధుమాధవి, రావురమేష్, ఎమ్మెస్ నారాయణ, నాగినీడు, అవసరాల శ్రీనివాస్, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, సమీర్ తదితరులు
సంగీతం- సెల్వ గణేష్
మాటలు-చంద్రశేఖర్
నిర్మాత- డీఎస్ రావు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- అశోక్.జి.
ఈ ఏడాది ఆరంభంలో ‘అలా మొదలైంది’తో సైలెంట్ హిట్ కొట్టిన నాని.. మరోసారి మరోసారి ఏ అంచనాల్లేకుండా బరిలోకి దిగాడు.. పిల్ల జమీందార్ గా. మార్నింగ్ షోకు జనాల్లేరు. తర్వాతి షోకు గుంపులు కనిపించాయి. సాయంత్రానికి క్యూలు కట్టారు. మంచి సినిమాల కరవు పట్టిన టాలీవుడ్లో ‘పర్లేదు’ అనే మాట చాలు జనాల్ని రప్పించడానికి. ‘అలా మొదలైంది’ స్థాయిలో లేకున్నా.. ఒక్కసారి చూసేందుకు సరిపడా ‘విషయం’ ఉంది పిల్ల జమీందార్ లో.
ప్రవీణ్ జయరామరాజు ఉరఫ్ పీజే (నాని) పెద్ద జమీందారుకు మనవడు. మహా పొగరుబోతు. ఐదు వేల కోట్లకు ఏకైక వారసుడు. మైనార్టీ తీరగానే తాత ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని జల్సాలకు రెడీ అయిపోతాడు. అంతలో అతనికో షాక్. తాను చెప్పిన కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి (అదీ మూడేళ్లలోనే), ఆ కాలేజీలోనే స్టూడెంట్ లీడర్ గా గెలిస్తేనే ఆస్తి దక్కుతుందంటూ వీలునామా రాసి ఉంటాడు అతని తాత. స్కాలర్ షిప్ తోనే చదవాలి, గొడవలు పడకూడదు.. లాంటి షరతులు కూడా ఉంటాయందులో. చేసేది లేక కాలేజీకి వెళ్తాడు పీజే. అక్కడతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటినతను ఎలా ఎదుర్కొన్నాడు? తాత పెట్టి పరీక్షలు పాసై ఆస్తినందుకున్నాడా అన్నది మిగిలిన కథ.
హీరో ఎదవగా ఉండి.. తర్వాత బుద్ధి తెచ్చుకుని, మంచి మనిషిగా మారిపోయే సినిమాలు మన తెలుగులో చాలానే వచ్చాయి. మొన్నటి మిస్టర్ పర్ఫెక్ట్ కూడా కొంచెం ఈ కోవలోనిదే. ఈ పిల్ల జమీందార్ రూటు కూడా అదే. నిజానికీ సినిమాలో కొత్తదనమేమీ లేదు. సినిమా ఎలా ఉండబోతోందనేది, ఎలాంటి సన్నివేశాలుండబోతున్నాయనేది తొలి అరగంటలోనే అర్థమైపోతుంది. మరీ సెకండాఫ్ లో అయితే అన్నీ అనుకున్నట్లే సాగుతాయి పొల్లుపోకుండా. కాకపోతే మన టాలీవుడ్లో మినిమం గ్యారెంటీ సినిమాలు కూడా కరవైపోయి, నాసిరకం సినిమాలు దిగుతున్న పరిస్థితుల్లో పిల్ల జమీందార్ ఎంతో బెటర్. ఉన్నంతలో నవ్వించాడు. కొన్ని చోట్ల ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఏడిపించాడు. మొత్తంగా పర్లేదు మంచి సినిమానే చూశాం అన్న సంతృప్తినిచ్చాడు. దర్శకుడు కొరియన్ సినిమాను కాపీ కొట్టి పిల్ల జమీందార్ ను తయారు చేశాడు కానీ.. నేటివిటీని జొప్పించి, మనకనుగుణంగా మార్చడంలో సఫలమయ్యాడు. చాన్నాళ్ల తర్వాత పల్లెటూరి వాతావరణంలో, మన నేటివిటీకి తగ్గట్లు తీసిన సినిమా ఇది. హీరో మరుగుదొడ్లు కడిగే సన్నివేశంలో మగధీర స్పూఫ్.. డ్రామాకు వేషం కట్టిన స్నేహితుల్ని తాగి కొట్టే సీన్.. క్లైమాక్స్ లో ‘బ్యాంకాక్ ’ కిడ్నాప్ కామెడీ.. సినిమాలో హైలెట్స్. ఈ సన్నివేశాలు బాగా నవ్వించాయి. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనో పాట రీమిక్స్ తో కామెడీ పండింది.
కొత్త కలం.. చంద్రశేఖర్ రాసిన సంభాషణలు కొన్ని చోట్ల నవ్వించి, కొన్నిచోట్ల ఆలోచింపజేశాయి. ‘‘దేవుడు ప్రేమించడానికి మనిషినిచ్చాడు. వాడుకోవడానికి వస్తువునిచ్చాడు. కానీ మనిషి వస్తువును ప్రేమిస్తూ.. మనిషిని వాడుకుంటున్నాడు’’, ‘‘మా అమ్మ పోయినపుడు ఊహ తెలీదు.. ఇప్పుడు మానాన్న పోయాడు.. నాకింకేం తెలీదు’’, గెలుపుదేముందిరా.. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. కానీ ఒక్కసారి ఓడి చూడు.. నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది’’ వంటి మంచి డైలాగ్స్ రాశారు చంద్రశేఖర్. సెల్వ గణేష్ స్వరపరిచిన పాటలు ఏవరేజ్. ‘ఊపిరి’ పాట ఒక్కటే కాస్త వినసొంపుగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. క్లైమాక్స్ కు ముందొచ్చే పాట వేస్ట్. దాన్ని ఎడిటింగ్ లో తీసేసినా పోయేదేం లేదు. సెకండాఫ్ లో ఎలక్షన్ సీన్స్ అంతగా కనెక్ట్ కాలేదు. ఇవి పందెం సినిమాని గుర్తుకుతెస్తాయి.
సినిమాకు కచ్చితంగా నానినే ప్రత్యేక ఆకర్షణ. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాని కోసమే ఈ సినిమా చూడొచ్చు. ప్రస్తుతం తెలుగులో ‘వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్’ నాని అని తీర్మానించొచ్చు. అందుకు పిల్ల జమీందార్ మరో చక్కటి ఉదాహరణ. సినిమాను నిలబెట్టడంలో నాని నటనదే ప్రధాన పాత్ర. మరో నటుడైతే పీజే పాత్ర పండేది కాదేమో. పొగరుబోతుగా, తర్వాత మారిన మనిషిగా చక్కటి వేరియేషన్స్ చూపించాడు నాని. ముఖ్యంగా అతని ‘టైమింగ్’ ముచ్చటగొలుపుతుంది. కామెడీ అయినా, సెంటిమెంట్ సీనైనా కొలిచినట్లుండే అతని నటన అందరినీ ఆకట్టుకుంటుంది. పనివాడిగా డ్రామాలో నటించే సన్నివేశం.. డిబేట్లో స్పీచ్ ఇచ్చే సన్నివేశం.. క్లైమాక్స్ సీన్లో చక్కటి ఎమోషన్స్ పలికించాడు నాని. అతని డైలాగ్ డెలివరీని చూసి, చాలామంది హీరోలు నేర్చుకోవాలి. సెకండాఫ్ లో డ్రామా ఎక్కువైనా.. నాని నటన కొంతవరకు దాన్ని డైజస్ట్ చేసుకునేందుకు తోడ్పడుతుంది. ఇక నాని తర్వాత రావు రమేష్ కు ఎక్కువ మార్కులు. విలేజ్ లో వినాయకుడు తరహా ‘స్ట్రిక్ట్’ పాత్రకు రమేష్ న్యాయం చేశాడు. కొత్త బంగారు లోకం ఛాయలు కూడా కనిపిస్తాయి అతని పాత్రలో. ఎమ్మెస్ నారాయణ చాన్నాళ్లకు కొంచెం భిన్నమైన క్యారెక్టర్ చేశారు. కామెడీ, సెంటిమెంట్ కలగలిసిన పాత్రలో ఆయన మెప్పించారు. హీరోయిన్లకు మాత్రం ఏ ప్రాధాన్యం లేదు. హరిప్రియలో హీరోయిన్ లక్షణాలు తక్కువే. బింధుమాధవిది వ్యర్థ పాత్ర. ఆమెను సరిగా వినియోగించుకోలేదు. జాతీయం పాత్రలో ధన్ రాజ్ నవ్వులు పూయించాడు. తాగుబోతు రమేష్ కూడా నవ్వించాడు. అవసరాల శ్రీనివాస్ ఓకే.
మినిమం గ్యారెంటీ వినోదంతో రూపొందిన పిల్ల జమీందార్ ను ఏ అంచనాలూ లేకుండా చూడండి. అలరిస్తాడు.
రేటింగ్-2.5/5

No comments:

Post a Comment

Thank you for your comment