Sunday, October 30, 2011

ఊసరవెల్లి రివ్యూ

చిత్రం-ఊసరవెల్లి
నటీనటులు- ఎన్టీఆర్, తమన్నా, పాయల్ ఘోష్, ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, తనికెళ్ల భరణి తదితరులు
కథ- వక్కంతం వంశీ
మాటలు- కొరటాల శివ
నిర్మాత- బీవీఎన్ఎస్ ప్రసాద్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం- సురేందర్ రెడ్డి
*****************************************
ఇప్పుడు టాలీవుడ్లో ఓ ట్రెండ్ నడుస్తోంది. గొప్ప యాక్షన్ హీరో అయినా.. సరే సీరియస్, యాక్షన్ మూవీస్ చేస్తానంటే.. జాన్తానై. కామెడీ, ఎంటర్టైన్ మెంట్.. ఇవి ఉంటేనే సినిమా హిట్టు.. లేదంటే ఫట్టు! తాజాగా దూకుడు గెలిచింది ఈ కామెడీ, ఎంటర్టైన్ మెంట్ తోనే. ఊసరవెల్లి కూడా ఫస్టాఫ్ లో ఈ సూత్రాన్నే నమ్ముకుంది. ఎన్టీఆర్ అభిమానుల్నే కాదు.. సగటు ప్రేక్షకుణ్ని కూడా మెప్పించింది. కానీ ద్వితీయార్థంతోనే సమస్య. ఎంటర్టైన్ మెంట్ ను గాలికొదిలేసి, అర్థం లేని ఓ ఫ్లాష్ బ్యాక్ తో కథనాన్ని చెడగొట్టి, ప్రేక్షకుల్ని బయపెట్టి బయటికి పంపిస్తుంది. ఫస్టాఫ్ పై ఉన్న ఇంప్రెషన్ ను కూడా చెడగొడుతుంది.
*****************************************
తమన్నాకు పిచ్చెక్కుతుంది.. తనకు సాయం చేయమని ఆమె దీనంగా ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుంటుంది.. అతను వదలమంటూ అలాగే లాక్కెల్తాడు.. అయినా కాళ్లు వదలదు.. అతను ఎగిసి తంతాడు.. తమన్నా ఎగిరి అంత దూరం పడుతుంది.. ఊహించుకుంటుంటేనే ఇబ్బందిగా లేదూ.. మరి తెరమీద ఇంకెంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి.
*****************************************
హీరో ఓ చిల్లర రౌడీ. డబ్బులిస్తే ఎవర్నైనా కొట్టేస్తాడు. విలన్లకు అతనికీ ఏ శత్రుత్వమూ ఉండదు. హీరోయిన్ తో పరిచయమూ ఉండదు. కానీ ఆమె తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పగానే ఓ ఎమోషన్ తెచ్చేసుకుంటాడు. ఆమెకు మాటిచ్చేసి 13 దేశాల్ని గడగడలాడించే మాఫియా డాన్ ని, అతని గ్యాంగ్ ని ఏసేయడానికి రెడీ అయిపోతాడు. అందర్నీ ఏసేస్తాడు కూడా. హీరో అంత ఎమోషన్ ఎందుకు తెచ్చుకున్నాడో కానీ ప్రేక్షకులు మాత్రం ఏమాత్రం ఎమోషన్ లేకుండా, ఇదేం లాజిక్కురా అని తలలు పట్టుకుంటారు.
*****************************************
హీరోని విలన్లు కట్టేసి ఉంటారు. విలన్ వచ్చి నీకు టార్గెట్ ఇచ్చిందెవరో చెప్పరా అంటాడు. హీరో కామెడీ చేస్తాడు.. జోకులేస్తాడు.. అంతలోనే మళ్లీ ఎమోషన్ తెచ్చేసుకుంటాడు. నా పల్స్ రేట్ నలభయ్యే.. దాన్ని 70కి తెస్తే రచ్చరచ్చే అంటాడు. ఇంకో నాలుగులైన్ల పౌరుషం డైలాగులు చెబుతాడు. అదేంటి.. అంతలో కామెడీ, అంతలోనే సీరియస్సా అనుకుంటాడు ప్రేక్షకుడు. ఓహ్.. సినిమా పేరు ఊసరవెల్లి కదా.. సన్నివేశాలు కూడా ఎప్పటికప్పుడు ఇలా రంగులు మారిపోతాయి కాబోలు అనుకుని సర్దిచెప్పుకుంటాడు!
ప్రథమార్ధంలో ఊపుమీదున్న ‘ఊసరవెల్లి’ని నీరసవల్లిగా మార్చే ఇలాంటి సన్నివేశాలు బోలెడున్నాయి సెకండాఫ్ లో.
***********************************************
టోనీ (ఎన్టీఆర్), నీహారిక (తమన్నా) కాశ్మీర్ లో ఉగ్రవాదులకు దొరికిపోయి అక్కడ కలుసుకుంటారు. కాసేపట్లో చచ్చిపోతామని తెలిసి.. గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్, ఫస్ట్ కిస్ అంటూ టోనీ తన చిన్ని చిన్ని ఆశల గురించి చెబుతుంటే.. నీహారిక ముద్దిచ్చేస్తుంది. అంతే టోనీ ఫ్లాట్. అప్పటిదాకా కామ్ గా ఉన్న టోనీ.. ఉగ్రవాదుల్ని ఇరగకుమ్మేసి, హీరోయిన్ ని రక్షిస్తాడు. నీహారిక మిస్సయిపోయినా.. తర్వాత ఈజీగా ఇంటికెళ్లిపోతాడు. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసినా వెంటపడతాడు. చివరికి ఆమెను పడేస్తాడు. అంతలోనే అతనిలోని మరో కోణం బయటపడుతుంది. మాఫియా డాన్ అజ్జూ బాయ్ (ప్రకాష్ రాజ్) తమ్ముణ్ని, అతని గ్యాంగ్ ని చంపేస్తాడు. ఓ పోలీసాఫర్ ని కూడా చంపుతాడు. అది చూసిన నీహారిక ఫ్రెండు.. టోనీని నిలదీస్తుంది. అప్పుడు తన ఫ్లాష్ బ్యాక్, నీహారిక ఫ్లాష్ బ్యాక్ మిక్స్ చేసి చెబుతాడు టోనీ. ఇంతకీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? నీహారికకు, టోనీకి ఉన్న సంబంధమేంటి? అన్నది మిగతా కథ.
ఒకటి రెండు కాదు.. లెక్కలేనన్ని ట్విస్టులున్నాయి సినిమాలో. కానీ అతకని ట్విస్టులే ఎక్కువే. ఎన్టీఆర్ ను కొత్తగా చూపించే ప్రయత్నం ప్రథమార్ధంలో ఫలించింది. రఘుబాబు, జయప్రకాష్ రెడ్డిలతో కలిసి మంచి కామెడీ పండించాడు నందమూరి హీరో. నటన కూడా కొంచెం కొత్తగా ట్రై చేశాడు. భయం నటిస్తూ రఘుబాబు గ్యాంగ్ ను కొట్టే సన్నివేశాలు, వాళ్లను ఆడుకునే సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ సరదాగా సాగిపోవడానికి ఈ సన్నివేశాలు బాగానే ఉపయోపడ్డాయి. ఇంటర్వల్ కు ముందు భారీ యాక్షన్ సీన్ (దూకుడులో లాగే ఇదే క్లైమాక్స్ రేంజిలో ఉంటుంది) మాస్ ను మెప్పిస్తుంది. హీరో అంతమందిని ఎందుకు చంపాడబ్బా.. ఏదో బలమైన కారణమే ఉంటుంది అనుకున్న ప్రేక్షకుడు అసలు విషయం తెలిసి నీరసపడిపోతాడు. హీరో తండ్రి చనిపోతూ ఏదో ఒక మంచి పని చేయరా.. అని బలంగానే చెబుతాడు కానీ, అతను దెబ్బతినే, హీరో హాస్పిటల్ కు తీసుకొచ్చే సన్నివేశాల్లో సీరియస్ నెస్ లేదు. దీంతో హీరో తండ్రి మాటను తలుచుకుని, హీరోయిన్ పగను తన పగగా భావించడం లాజిక్ కు అందదు. అసలు తమన్నా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు తలుచుకుంటేనే భయపెట్టేలా ఉన్నాయి. అసలు ఓ కమర్షియల్ సినిమాలో హీరోయిన్ ను ఈ స్థితిలో చూడ్డానికి ఏ ప్రేక్షకుడూ ఇష్టపడడు. ఆమె బాగానే నటించినా ప్రయోజనం లేకపోయింది. ఓ అమ్మాయి రాత్రంతా ఇంటిముందు కూర్చోవడం, తర్వాత ముక్కూ మొహం తెలియని అబ్బాయిని చూసి.. అప్పటికప్పుడు అతనే తన రక్షకుడని నమ్మడం, అతణ్ని వేడుకోవడం.. అంతా అర్థం పర్థం లేకుండా సాగుతుంది. సురేందర్ రెడ్డి తన ఎఫర్ట్స్ అన్నీ ఫస్టాఫ్ మీదే పెట్టాడు. స్క్రీన్ ప్లేను డిఫరెంట్ గా ప్రెజంట్ చేయబోయి, తాను గందరగోళంలో పడి, ప్రేక్షకుల్నీ గందరగోళంలోకి నెట్టాడు. ఊసరవెల్లి టైటిల్ ను జస్టిఫై చేయడంపై ఫస్టాఫ్ లో బాగానే దృష్టిపెట్టిన సురేందర్.. ద్వితీయార్ధంలో ఆ విషయాన్నే మర్చిపోయాడు. అసలు హీరో ఒరిజనల్ క్యారెక్టర్లో ఊసరవెల్లి లక్షణాలే లేవు. హీరోయిన్ తో ప్రేమ కోసం ప్రయత్నించే సమయంలోనే అతనిలో రంగులు కనిపిస్తాయి. బాగున్న పాటలన్నీ (బ్రతకాలి, నేనంటే నాకు, దాండియా) ప్రథమార్ధంలోనే పేర్చేశారు. దాండియా పాటలో కొరియోగ్రఫీ బాగుంది. బ్రతకాలి పాటకు ఎంచుకున్న థీమ్ బాగుంది. టేకింగ్ కూడా ఓకే. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, అతని నటన రొటీన్, బోరింగ్. రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి అండ్ బ్యాచ్ నవ్వించింది.
ఊసరవెల్లి చూడాలనుకుంటే ఓ హెచ్చరిక. ఫస్టాఫ్ చూసి, సెకండాఫ్ లో హీరో ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలెట్టగానే థియేటర్ ఖాళీ చేసేయండి!
రేటింగ్- 2/5

No comments:

Post a Comment

Thank you for your comment