Monday, October 31, 2011

‘హంటా’ వైరస్.. ఏమిటిది?

అది ఒకప్పుడు ప్రపంచ దేశాలను వణికించిన వైరస్.  యుకె లాంటి అగ్రదేశాలను సైతం ఈ వైరస్‌ గడగడలాడించింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాణాంతక వైరస్‌లలో ఇది ఒకటి.  ఇంతకీ అది ఏంటో తెలుసా… హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్‌పీఎస్)గా పిలిచే ఈ వైరస్ ప్రమాదకరమైనది. దీనివల్ల ప్రాణానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. బనియావెడె ఫ్యామిలీకి చెందిన ఈ వైరస్‌ను కొరియా యుద్ధ సమయంలో అమెరికన్ సైనికుల్లో గుర్తించారు. 1975లో దక్షిణ కొరియాలోని హంటన్ నదీతీరంలో కనుగొనడం వల్ల దీనికి హంటావైరస్ అని పేరు వచ్చింది. అప్పట్లో అనేక మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు.
ఎక్కడి నుంచి వస్తుంది?

ఈ వైరస్‌ను ఎలుకల్లో కనుగొన్నారు. వాటి ద్వారానే ఇది వ్యాపిస్తుంది. వాటి మలమూత్రాల్లో, లాలాజలంలో హంటా వైరస్ ఉంటుంది. ఇది దుమ్ముధూళి కణాలతో చేరి కొన్ని రోజులు జీవించగలదు. దాన్ని పీల్చడం వల్ల కానీ, ఆహారం, తాగు నీరు ద్వారా కానీ మనకు వ్యాపిస్తుంది. ఎలుకలు ఎక్కువగా ఉన్నచోట నివసించే వారికి వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది. కుక్కలు, పిల్లుల ద్వారా ఇది సోకదు.
భారత్‌లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కరీంనగర్, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఈ వైరస్ బయటపడినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇది నిర్ధారించడానికి ప్రత్యేకపరీక్షలు చేసే అవకాశం ఇప్పటికీ లేదు.
లక్షణాలేమిటి?
ఈ వైరస్ వల్ల మూత్రపిండాలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అన్ని విషజ్వరాల మాదిరే హంటా సోకిన వారిలో ఒళ్లునొప్పులు, తలనొప్పి, వాంతులు, కనుగుడ్ల వెనుక నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన మూడు రోజుల తరువాతే ఈ లక్షణాలు బయటపడతాయి. వైరస్ మొదట రక్తనాళాలను దెబ్బతీస్తుంది. సూక్ష్మ రక్త నాళాలు దెబ్బతినడంతో ప్లాస్మా బయటపడుతుంది. దాంతో రక్తం చిక్కబడి ర క్తపోటు పడిపోతుంది. అప్పుడు ఆక్సిజన్ అందదు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె ఒకటి తరువాత ఒకటి దెబ్బతింటాయి. ఆ తరువాత రోగి చనిపోతాడు. ఇదంతా రెండు మూడు గంటల్లోనే జరిగిపోతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు మొదట్లో గుర్తించలేము. ఒళ్లు నొప్పులతో జ్వరం వస్తే అనుమానించి వెంటనే యాంటీ బాడీస్ పరీక్షలు చేయించుకోవాలి.
వైద్యులు చేసే పరీక్షలు…
హంటా వైరస్ కనుగొనడానికి రక్త పరీక్షలు. సీబీసీ(కంప్లీట్ బ్లడ్ కౌంట్) పరీక్ష. కంప్లీట్ మెటబోలిక్ ప్యానెల్. ఛాతి ఎక్స్‌రే. ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరును తెలుసుకునే పరీక్షలు. రోగికి శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది కనుక.. వెంటనే ఆక్సిజన్ ఇస్తారు.
ముందస్తు జాగ్రత్తలు..
ఇంట్లో, వంటగదిలో ఎలుకలు లేకుండా చూసుకోవడం. పరిశుభ్రత పాటించడం. క్యాంపులకు వెళ్లేటప్పుడు ఎలుకల మలమూత్రాలు ఉన్న చోట టెంట్లు వేయకపోవడం.

No comments:

Post a Comment

Thank you for your comment