ఈ మాత్రం దూకుడు చాలు!
దూకుడులో
‘కొత్త’గా ఏం లేదు. శ్రీను వైట్ల ఇంతకుముందు తీసిన ఢీ, రెఢీ, కింగ్..
సినిమాల్లాగే ఉంటుంది. క్యారెక్టర్లు కూడా కొత్తగా ఏం లేవు. అన్నీ అతని
సినిమాల్లో చూసినవే. మహేష్ బాబు కూడా కొత్తగా కనిపించిందేం లేదు. పోకిరిలో
లాగే ఇందులోనూ ఐపీఎస్. విలన్లని వేటాడేస్తుంటాడు. అతని ‘నోటి దూల’ కామెడీని
ఖలేజాలోనే చూసేశాం. మ్యూజిక్ ఏవరేజ్.. మూడు గంటల పెద్ద సినిమా.. ఇలాంటి
లూప్ హోల్స్ చాలానే ఉన్నాయి ‘దూకుడు’లో. అయినా కూడా దూకుడు బాక్సాఫీసును
దున్నేస్తుంది. ఎందుకంటే ఎంటర్ టైన్మెమెంట్ కు ఏ మాత్రం ఢోకా లేదీ
సినిమాలో.
బ్రహ్మానందం బిగ్ బ్రదర్ టైపు రియాల్టీ షోలో పాల్గొని.. ‘‘నా యాక్టింగ్ గనుక మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి
చంపక్ దాస్ అని టైప్ చేసి.. ^^^ నంబర్ కి ఎసెమ్మెస్ చేయండి’’ అంటుంటే నవ్వు ఆపుకోగలమా?
చంపక్ దాస్ అని టైప్ చేసి.. ^^^ నంబర్ కి ఎసెమ్మెస్ చేయండి’’ అంటుంటే నవ్వు ఆపుకోగలమా?
ఎమ్మెస్ నారాయణ సింహా వేషంలో ‘నో పోలీస్’ అంటూ బాలయ్య డైలాగులు చెబుతుంటే కడుపు చెక్కలు కాకుండా ఉంటుందా?
ఇక మహేష్ బాబు.. ‘కళ్లున్నోడు ముందే
చూస్తాడు. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు’ లాంటి షార్ప్ డైలాగులతో
తూటాలు పేలుస్తుంటే.. ఎంజాయ్ చేయకుండా ఉండగలమా..? ఇలాంటి మరెన్నో
విశేషాలున్నాయి దూకుడులో. ముందు కథలోకి వెళ్దాం!
ఇది తండ్రిని ప్రేమించే ఓ మంచి పోలీసు అధికారి కథ. మహేష్ బాబు. ఓ పోలీసు
ఉన్నతాధికారి స్పెషల్ టీం నాయకుడు. అతను పోలీసులకు ఛాలెంజ్ గా నిలబడిన ఓ
క్రిమినల్ పట్టుకోవాలి. అయితే, ఈ పోలీసు శంకరన్న (ప్రకాష్ రాజ్ – పీజేఆర్
పాత్ర అని ప్రచారం జరిగింది కానీ.. ఆ షేడ్స్ మాత్రమే ఉన్నాయి) అంటే ప్రజలకు
ప్రాణం వారన్నా శంకరన్నకు ప్రాణం. మంచి మనిషి. ఓ రౌడీ చేస్తున్న దందాను
అడ్డుకోబోయినందుకు వాళ్లు ఆయనను లేపేస్తారు. తన లాగే ప్రజానాయకుడు
అవుతాడనుకున్న శంకరన్న కొడుకు మహేష్ బాబు పోలీసు అధికారి అవుతాడు. పోలీసు
డిపార్టుమెంటుకు సవాలుగా నిలిచిన నాయక్ (సోనూసూద్) ను పట్టుకునే ప్రయత్నంలో
సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. నాయక్ వేటలో కథ టర్కీకు వెళ్లి మళ్లీ
హైదరాబాద్ కు వస్తుంది. ఇల్లు అద్దెకు ఇచ్చకుని నటనపై ఉన్న ఆశను
నెరవేర్చుకునే బ్రహ్మానందం, సినిమాయే జీవితంగా బతికే ఎంఎస్ నారాయణల సహాయంతో
(వాళ్లకు తెలియకుండానే వారిని పావులుగా వాడుకుంటూ) నాయక్ ను ఎలా
పట్టుకుంటాడు అన్నదే కథ. ఇందులో ప్రధాన ట్విస్టు సోనూ హత్యా ప్రయత్నంలో
కోమాలోకి వెళ్లి పద్నాలుగేళ్ల తర్వాత శంకరనారాయణ బతకడం. దీనివల్ల సినిమా
మొత్తం కొత్త మలుపు తీసుకుంటుంది.
శ్రీను వైట్ల, మహేష్ లు ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు థ్యాంక్స్
చెప్పాలి. మహేష్ లోని కొత్త కోణాన్ని ‘ఖలేజా’తో వెలికి తీసింది
త్రివిక్రమే. ఎక్కువగా కామ్ క్యారెక్టర్లు చేసే మహేష్ తో ‘నోటి దూల’
క్యారెక్టర్ వేయించి.. అతణ్నుంచి ఎంత కామెడీ రాబట్టవచ్చో చూపించాడతను.
మహేష్ లోని ఈ కొత్త కోణానికి తన మార్కు ఎంటర్ టైన్మెంట్ ను జోడించి శ్రీను
వైట్ల తెలుగు ప్రేక్షకులకు నవ్వుల విందు వడ్డించాడు. ఒక రకంగా చెప్పాలంటే
దూకుడులోని అజయ్ పాత్ర ‘హిట్ వెర్షన్ ఆఫ్ ఖలేజా క్యారెక్టర్’ అని
చెప్పొచ్చు. సెకండాఫ్ ను బ్రహ్మానందం, ఎమ్మెస్ లు మోశారు కానీ.. ఫస్టాఫ్
మొత్తం మహేష్ వన్ మ్యాన్ షో. సమంతను మహేష్ టీజ్ చేసే, నోటి దూలతో ఆమెకు
అడ్డంగా దొరికిపోయే సన్నివేశాలతో తొలి గంట చకచకా గడిచిపోతుంది. అంతలోనే
బ్రహ్మానందం ఎంటరైపోతాడు. అతణ్ని భలేగా ‘వాడేసుకుని’, ఆపై సూపర్బ్ యాక్షన్
సీక్వెన్స్ తో ఫస్టాఫ్ మీద మంచి ఇంప్రెషన్ వచ్చేలా చేస్తాడు మహేష్.
సెకండాఫ్ సాగదీసినా, రొటీన్ గా సాగినా.. కామెడీకి లోటు లేకపోవడంతో మొత్తంగా
సంతృప్తిగానే బయటికొస్తాడు ప్రేక్షకుడు. మహేష్ చక్కని టైమింగ్ తో చెప్పిన
డైలాగులు సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ‘‘భయానికి మీనింగే తెలియని బ్లడ్
రా నాది’’‘‘మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ గా వెళ్లిపోతా’’‘‘ఈ దూకుడే లేకుంటే
పోలీసోడికి పోస్టు మ్యాన్ కి తేడా ఏముంటుంది’’ ‘‘పడుకునే పులిని,
పనిచేస్కునే పోలీసుని కెలికితే.. వేటే’’ ‘‘ఒక్క నిమిషం టైమిస్తే ఆలోచిస్తా.
రెండు నిమిషాలకు యాక్షన్లోకి దిగుతా.. మూడో నిమిషంలో
ముగించేస్తా’’‘‘నేనెవర్నయినా టార్గెట్ చేశానంటే వాడికి పైన బెర్త్ కన్ఫర్మ్
అయిపోవాల్సిందే’’ ‘‘నేను నరకడం మొదలుపెడితే.. నరకం బయట హౌస్ ఫుల్ బోర్డు
పెడతారు’’ (ఈ డైలాగు చెప్పి.. బాగ చెప్పాను కద భయ్యా అంటాడు మహేష్)
అభిమానులతో ఈలలేయించే ఇలాంటి డైలాగులు చాలానే ఉన్నాయి. డ్యాన్సులు, ఫైట్ల విషయంలోనూ అభిమానుల్ని అలరించాడు ప్రిన్స్. కానీ సెంటిమెంట్ సన్నివేశాల్లో కొత్తగా ఏం చేయలేకపోయాడు. అదేంటోగానీ మహేష్ క్యారెక్టర్ విలన్లతో డీల్ చేసేటపుడు, హీరోయిజం చూపించేటపుడు, ఫైటింగుల ముందు తెలంగాణ యాసలోకి వెళ్లిపోతాడు. మిగతా సీన్లలో మామూలుగా మాట్లాడతాడు. నైజాం ఏరియాలో తెలంగాణ సెగ తగలకుండా ఉండేందుకు ఇదో రకం ఎత్తుగడేమో!
అభిమానులతో ఈలలేయించే ఇలాంటి డైలాగులు చాలానే ఉన్నాయి. డ్యాన్సులు, ఫైట్ల విషయంలోనూ అభిమానుల్ని అలరించాడు ప్రిన్స్. కానీ సెంటిమెంట్ సన్నివేశాల్లో కొత్తగా ఏం చేయలేకపోయాడు. అదేంటోగానీ మహేష్ క్యారెక్టర్ విలన్లతో డీల్ చేసేటపుడు, హీరోయిజం చూపించేటపుడు, ఫైటింగుల ముందు తెలంగాణ యాసలోకి వెళ్లిపోతాడు. మిగతా సీన్లలో మామూలుగా మాట్లాడతాడు. నైజాం ఏరియాలో తెలంగాణ సెగ తగలకుండా ఉండేందుకు ఇదో రకం ఎత్తుగడేమో!
శ్రీను వైట్ల తన శైలికి కొంత యాక్షన్ ను జోడించి మంచి కమర్షియల్ మూవీ
తీసిపెట్టాడు. ఐతే అతను కొత్తదనం జోలికి పోవడానికి ఇష్టపడలేదు. ఎప్పట్లాగే
అతని హీరో సెకండాఫ్ అంతా విలన్ బ్యాచ్ లోనే కలిసిపోయి, డ్రామాలాడుతూ,
అందరినీ ఎదవల్ని చేస్తూ తన పని కానిచ్చేస్తాడు. సుబ్బరాజు, సుప్రీత్,
ఎమ్మెస్ నారాయణ, భరత్.. ఇలా చాలా క్యారెక్టర్లు అతని గత సినిమాల్లో నుంచి
తీసుకున్నవే. కాకపోతే తాగి ఊగే, దెబ్బలు తినే క్యారెక్టర్లు మాత్రం లేకుండా
చూసుకున్నాడు. శ్రీను వైట్ల బ్యాచ్ లో (కథ= గోపీ మోహన్+శ్రీను వైట్ల,
మాటలు=కోన వెంకట్+శ్రీను వైట్ల) ఉన్న గొప్ప గుణం ఏంటంటే.. వారి కామెడీ
మొత్తం సమకాలీన పరిస్థితుల్ని బేస్ చేసుకునే ఉంటుంది. కింగ్ లో మ్యూజిక్
డైరెక్టర్ల అతి తెలివితో కామెడీ ఇరగదీసిన వైట్ల.. ఇందులో ‘రియాల్టీ షో’
కాన్సెప్ట్ తో కావాల్సినంత వినోదాన్ని పండించాడు. నటీనటుల నుంచి మంచి
టైమింగ్ తో కామెడీ రాబట్టాడు వైట్ల.
మహేష్ తర్వాత సినిమాకు ప్రధాన బలం బ్రహ్మానందం, ఎమ్మెస్ లే. బ్రహ్మి
అన్నట్లు.. అతణ్ని వాడుకుంటే (సినిమాలో నాలోని నటుణ్ని వాడుకోండి వాడుకోండి
అంటుంటాడతను) ఎంతమంచి ఔట్ పుట్ వస్తుందో దూకుడు మరో ఉదాహరణ. బ్రమ్మి
ఇంట్రడక్షన్, ఎండింగ్ సీన్లు భలేగా పేలాయి. ఇక అప్పట్లో దుబాయ్ శీనులో
సాల్మన్ రాజుతో కిక్కెక్కించిన ఎమ్మెస్ నారాయణ మళ్లీ ఇన్నాళ్లకు ఆ రేంజిలో
పిచ్చెక్కించాడు. యమదొంగ, మగధీర, సింహా, రోబో వేషాల్లో అతను చేసిన కామెడీ
సినిమాకే హైలైట్. ముఖ్యంగా సింహా వేషం ఎమ్మెస్ కు బాగా నప్పింది.
సమంత గురించి ఏం చెప్పాలో! నేచురల్ బ్యూటీ అయిన ఈ అమ్మాయిని అతి మేకప్
తో చెడగొట్టారు. బహుశా మహేష్ కు మ్యాచ్ చేయాలని అంత మేకప్పేశారేమో. ఆమె
పాత్రకు కూడా ఏమంత ప్రాధాన్యం లేదు. హీరోకు ఓ జోడీగా, పాటల్లో ఆడిపాడటానికి
మాత్రమే ఆమె ఉపయోగపడింది. ఏమాయ చేశావెలో అంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్
వల్ల చిన్మయి డబ్బింగ్ సమంతకు ప్లస్ అయింది కానీ.. ఈ సినిమాలో ప్రత్యేకత
లేక చిన్మయి వాయిస్ చిన్నబోయింది. ఐతే ఏమాయ.., బృందావనంలతో పోలిస్తే
సెక్సీగా కనిపించింది దూకుడులో. ప్రకాష్ రాజ్ పాజిటివ్ క్యారెక్టర్ చేశాడు.
కానీ అతని నటన ‘అర్జున్’లోని నెగెటివ్ క్యారెక్టర్ ను గుర్తుకు తెచ్చింది.
కానీ తన పాత్రకు ప్రకాష్ రాజ్ న్యాయం చేశారు. మిగిలిన వాళ్లలో శాస్త్రిగా
వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బాగుంది. ఫస్టాఫ్ లో అతనున్న సన్నివేశాలు
పండాయి. కానీ ద్వితీయర్ధంలో ఎమ్మెస్, బ్రహ్మానందంల జోరులో అతణ్ని
పక్కనబెట్టేశారు. పార్వతి మెల్టన్ ఒంట్లో కండ చాలావరకు మెల్టయింది. సన్నబడి
కొత్త లుక్ తో కనిపించింది. ఆమెపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ ‘పూవై పూవై’..
ఒకప్పటి ‘ఓ అప్పారావు.. ఓ సుబ్బారావు’ టైపులో సాగింది. కొరియోగ్రఫీ కూడా
అలాగే ఉంది. ఐతే ఈ పాట కూడా సినిమాకు ఓ ఆకర్షణే.
విలనిజంలో సీరియస్ నెస్ లేదు. మూవీలో ఎక్కడా హ్యూమరస్ ఫీల్ పోకుండా
ఉండటానికో ఏమో మెయిన్ విలన్ (సోనూ సూద్)తో సహా అందరు విలన్ల క్యారెక్టర్ల
లోనూ కామెడీ పాళ్లే ఎక్కువగా నింపారు. ఇంటర్వల్ ముందు భారీ ఫైట్ జరిగినా
ఆడియన్స్ లో సీరియస్ మూడ్ లోకి రారు. విలన్ ఇంట్రడక్షన్ సీన్లోనే ఘంటసాల
పాట వింటూ కనిపించడంతోనే అతను కామెడీ విలన్ కేటగిరీలోకి చేరిపోయాడు. తర్వాత
అతను క్రూరుడని చూపించడానికి ఎన్ని మర్డర్లు చేయించినా ప్రేక్షకులకు గానీ
హీరోగ్గానీ (అతనిదసలే భయానికి మీనింగే తెలియని బ్లడ్) రవ్వంత కూడా భయం
పుట్టదు. ఓ సీన్లో విలన్ మరీ అన్యాయంగా ఒక్క సుమో కోసమని నలుగురు
కుర్రాళ్లను చాలా వయొలెంట్ గా చంపి అవతల పడేస్తాడు (అంత పెద్ద డాన్ కు సుమో
కూడా దొరకలేదా అని అడక్కండి). అసలు సోనూ సూద్ పాత్రలో ఏమాత్రం కొత్తదనం
లేదు. ఏక్ నిరంజన్ సినిమాలోని శాడిస్ట్ విలన్ క్యారెక్టర్ కు పొడిగింపులా
ఉంది అతని పాత్ర. అతని గెటప్ కూడా నప్పలేదు.
తీసిన సీన్లు ఎందుకు వేస్టుగా పడెయ్యడమనుకున్నారో ఏమో అన్నింటినీ
పేర్చేయడంతో దూకుడు మూడు గంటల పెద్ద సినిమా కూర్చుంది. ఫస్టాఫ్ గంటన్నర
దాటేయడం, అందులో ఇంటర్వల్ ముందు పేద్ద ఫైటు పెట్టడంతో అప్పటికే ఓ సినిమా
(ఫస్టాఫ్ సరదాగానే సాగినప్పటికీ) చూసిన ఫీలింగొచ్చేస్తుంది. పాపం ఎడిటరుకు
పెద్దగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లు లేరు. అతను ఫైటింగు సీన్లల్లో మాత్రమే తన
పనితనం చూపించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా షార్ప్ గా ఉన్నాయి. థమన్
పాటలు ఆడియోలో కంటే తెరమీద బావున్నట్లు అనిపించాయి. అలాగని పాటల్ని గొప్పగా
ఏం తీయలేదు. గొడవ గొడవ లాంటి మాస్ పాటని.. ఫారిన్ లొకేషన్స్ లో, విదేశీ
డ్యాన్సర్ల మధ్య తీయాలన్న ఆలోచన శ్రీను వైట్లకు ఎందుకొచ్చిందో? ఐతే చుల్
బులి పాటకు ఎంచుకున్న లొకేషన్స్ డిఫరెంట్ గా, కొత్తగా ఉన్నాయి.
కాస్ట్యూమ్స్ కూడా బాగా సూటయ్యాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే. కామెడీ
సన్నివేశాల్లో సిచ్యువేషన్ కు తగ్గట్లు నేపథ్య సంగీతం బాగా కుదిరింది.
కామెడీకి ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా తోడైన దూకుడును క్లీన్ యూత్,
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చెప్పొచ్చు. వాస్తవానికీ సినిమా ఎబౌ ఏవరేజే
అయినా.. లేకలేక వచ్చిన పెద్ద సినిమా కావడం, సెలవులు కూడా వస్తుండటం.. మహేష్
ఫ్యాక్టర్ అన్నీ కలిపి దూకుడును పెద్ద హిట్ గా నిలబెట్టే అవకాశం ఉన్నాయి.
రెండు వారాల తర్వాత వచ్చే ఊసరవెల్లి గట్టి పోటీ ఇవ్వకపోతే మాత్రం..
రికార్డులపై ‘దూకుడు’ సవారీ ఖాయం!
No comments:
Post a Comment
Thank you for your comment